Vangaveeti Radha Marriage: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత అయిన వంగవీటి రాధా కృష్ణ.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారు. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా కృష్ణా వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలియడం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. వంగవీటి రాధా కృష్ణా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. నర్సాపుం పట్టణానికి చెందిన ఓ యువతితో రాధా కృష్ణకు వివాహం ఖాయం అయినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా కృష్ణ మిత్రుడికి దగ్గరి బంధువుల అమ్మాయినే రాధా పెళ్లి చేసుకోబోతున్నారని, ఈ మేరకు నిశ్చయం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నర్సాపురం పట్టణానికి చెందిన జక్కం పుష్పవల్లితో రాధా కృష్ణకు వివాహం ఖాయం అయినట్లు సమాచారం. ఏలూరు మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మాని బాబ్జీల చిన్న కుమార్తెనే జక్కం పుష్పవల్లి. ఆమెతోనే వంగవీటి రాధాకు పెళ్లి జరగబోతోంది. ఈ నెల 19వ తేదీన నర్సాపురంలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. సెప్టెంబర్ లో 6వ తేదీన లేదా అక్టోబరులో వీరిద్దరు మూడు ముళ్ల, ఏడడుగుల బంధంతో ఒక్కటై పప్పన్నం తినిపించనున్నట్లు రాధా కృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరి వివాహం విజయవాడలోనే జరుగుతుందని అంటున్నారు. అయితే రాధా వివాహానికి సంబంధించిన వార్తలపై అధికారికంగా వంగవీటి రాధా ఎలాంటి ప్రకటన చేయలేదు.
వంగవీటి రాధా కృష్ణా 2004 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ ఉన్న రాధా.. రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే అభిమానులు, స్నేహితుల ఆహ్వానం మేరకు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు మాత్రం హాజరు అవుతున్నారు. వంగవీటి రంగా విగ్రహాలను ప్రారంభిస్తున్నారు. 2004 లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో అతి తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు రాధా. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల సమయంలో వంగవీటి రాధా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారానికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి రాధా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇంకా టీడీపీలోనే ఉన్నానని చెబుతున్నప్పటికీ.. ఆ పార్టీ నిర్వహించే సమావేశాలకు, కార్యక్రమాలకు, ఆందోళనలకు హాజరు కావడం లేదు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మాత్రం వెళ్లి మద్దతు తెలిపారు.
Also Read: Airport Metro: వచ్చే నెలలో ఎయిర్‌పోర్టు మెట్రో పనులు, 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు వంగవీటి రాధా కృష్ణ. తెలుగు దేశం పార్టీ తరఫున ఈ సారి వంగవీటి రాధా టికెట్ ఆశిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో టీడీపీ వంగవీటి రాధాకు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తుందో, ఆయన ఎక్కడి నుంచి పోటీలో దిగుతారో స్పష్టత రావాల్సి ఉంది.