ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నగరం అత్యంత కీలకమయిన నగరం.. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఇప్పుడు రెండు స్దానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. మూడో నియోజకవర్గం అయిన తూర్పు నియోజకవర్గంలో తెలుగు దేశం శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న వారికి సీట్లు ఇస్తామని వారిని గెలిపించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటనతో విజయవాడ లోని మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  జెండా ఎగరాలని పార్టి శ్రేణులకు పిలుపునిచ్చారు.


మూడు సీట్లు కీలకం
విజయవాడ నగరంలోని మూడు సీట్లను దక్కించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నుండి గెలిచి, మంత్రిగా కూడా పని చేశారు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు, శాసన సభ్యుడిగా గెలుపొందగా, ఆయనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా జగన్ బాధ్యతలను అప్పగించారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇంచార్జ్ గా దేవినేని అవినాష్ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ  అభ్యర్ది గద్దె రామ్మోహన్ శాసన సభ్యుడిగా గెలుపొందారు.


గెలుపు చాలా ఈజీ అంటున్న వైసీపీ...
ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోని మూడు నియోజకవర్గాల్లో గెలుపు చాలా ఈజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  భావిస్తోంది. గతంలో ఉన్న పరిస్దితులుకు భిన్నంగా ఇప్పడు విజయవాడ చాలా ప్రశాంత వాతావరణం ఉంది. రాజకీయ అల్లర్లు లేవు, దీంతో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించటం చాలా సునాయాసమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పాటుగా ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించటం కూడ ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. మరో నియోజకవర్గంలో పట్టు సాధిస్తే మూడు నియోజకవర్గాల్లో కూడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ నాయకుల్లో జోష్ నెలకొంది.


ప్రతిపక్షాల బలం ఎంత...
ఇదే సమయంలో మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల బలం ఎంత అనే విషయం పై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు దేశం, జనసేన ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా విజయవాడ సెంట్రల్  నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ గడిచిన ఎన్నికల్లో కేవలం 32 ఓట్లతో మాత్రమే తెలుగు దేశం ఓటమి పాలయ్యింది. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున ఉన్న గద్దె రామ్మోహన్ కు మంచిపేరు ఉంది. స్దానికంగా తెలుగు దేశం పార్టీకి కూడ బలం ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష పార్టిని ఢీ కొట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి కోణాల్లో పని చేయాలని పార్టీ నాయకులు అంటున్నారు.