Yanamala Ramakrishnudu: ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని గురువారం ఆవిష్కరించిన అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై, టీడీపీ నేతలపై చేసిన విమర్శలను ఆ పార్టీ నాయకులు తిప్పికొట్టారు. దేశంలోనే ఇంతటి ఫెయిల్యూర్ సీఎం ఎక్కడా లేడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. జనం తన మాటలు నమ్మడం లేదనే మారీచ జిత్తులు మళ్లీ ప్రారంభించారని దుయ్యబట్టారు. రామరాజ్యం కంటే రాక్షస రాజ్యంపైనే జగన్ కు మోజు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. అందుకే ఒంటిమిట్ట కళ్యాణానికి వెళ్లకుండా ఎగ్గొట్టారని యనమల విమర్శలు గుప్పించారు.


సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో సీఎం జగన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయారని అన్నారు. జాబ్ క్యాలెండర్ కు పట్టిన గతే జగన్ వెల్ఫేర్ క్యాలెండర్ కు కూడా పడుతుందని యనమల ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ అసమర్థ పాలనపై రాష్ట్ర ప్రజలకు తిరగబడే పరిస్థితి వస్తోందని అన్నారు. నాలుగేళ్ల జగన్ అరాచక, అప్రజాస్వామిక, నిరంకుశ పాలనపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని, అవి చూసి సొంత పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో, ప్రజాప్రతినిధులు నమ్మకం సన్నగిల్లుతోందని అన్నారు. ఆ నమ్మకాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు సీఎం జగన్ నానాపాట్లు పడుతున్నారని విమర్శలు గుప్పించారు.


మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు, ఏపీ పంజాబ్ లా మారిందని సాక్షాత్తూ ప్రధాని మోదీనే అన్నారని గుర్తు చేశారు యనమల రామకృష్ణుడు. ఉపాధి కల్పనకు కీలకమైన ఐటీ రంగంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలం అయిందని.. ఐటీ రంగంలో ఏపీ వాటా కేవలం 0.2 శాతం మాత్రమేనని జాతీయ నివేదికలు చెబుతున్నట్లు యనమల తెలిపారు. ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయంపై ఆధారపడుతోందని, అయితే ఎక్సైజ్ ఆదాయం ప్రభుత్వాదాయం కిందకు రాదనడం శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.


పచ్చి అబద్ధాలతో, కల్లబొల్లి కబుర్లతో మరోసారి జనాన్ని వంచించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా విమర్శలు గుప్పించారు. తల్లిని, చెల్లిని రోడ్డు పాలు చేసిన జగన్.. రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని రక్షిస్తానని చెబితే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. సొంత బాబాయిని చంపినవారితో విందులు, వినోదాలు చేసుకుంటున్న జగన్.. రాష్ట్ర ప్రజలను రక్షిస్తానంటూ హామీలు ఇస్తే ఎలా నమ్మాలంటూ నిలదీశారు. వైసీపీ పార్టీ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న నావలా తయారైందని.. అందుకే ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరుతున్నారని అన్నారు. 


స్కాములు చేసి కేసుల్లో ఇరుక్కుని బయటపడటానికి రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. కుంభకోణాలకు పెట్టింది పేరు జగన్ అని.. పుట్టినిల్లు వైసీపీ అని ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి జగన్ అని.. అలాంటి వ్యక్తి అంగబలం లేదని అనడం హాస్యాస్పదమని అన్నారు. తనకు మీడియా సపోర్ట్ లేదని అబద్ధాలు చెప్పి ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కుట్రలు, కుయుక్తులకు జగన్ పెట్టింది పేరలని రాష్ట్ర ప్రజలకు తెలుసంటూ ధ్వజమెత్తారు. లింగంగుంట్లలో సీఎం ప్రచారం చూస్తుంటే.. ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు ఉందని అన్నారు.