Jagananne Maa Bhavishyathu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఇవాళ్టి నుండి ఈ నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. జగనన్న రథసారథులు ప్రతీ ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలు సేకరించడంతో పాటు.. టీడీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మధ్య తేడాలు స్పష్టంగా చెప్పనున్నారు. మేనిఫెస్టోలో చెప్పిందే చేస్తున్నామని వివరిస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఏడు లక్షల మంది కార్యకర్తలు, నేతలు, రథసారథులు ప్రజల్ని కలుస్తారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు జరగనుంది. గృహ సారథులు ప్రతి 50 నుండి 100 ఇళ్లకు ఇద్దరు చొప్పున వెళ్లి జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని వివరిస్తారు. మొత్తం 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 






జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీలు సంజీవ్ కుమార్, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ లక్ష్యాన్ని చెప్పారు. దేశ చరిత్రలోనే జగనన్నే మా భవిష్యత్ లాంటి కార్యక్రమం జరగలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలనలో ప్రజలకు జరుగుతున్న మేలు గురించి, అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తారని నేతలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారమే అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని జనాలకు తెలిసేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుతం ప్రభుత్వానికి మధ్య తేడాలను స్పష్టంగా వివరిస్తారని చెప్పారు. 


ప్రజల దగ్గరకు వెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.. 
కుల, మతాలకు  అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, ప్రజల దగ్గరకు వెళ్లడమే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్సే మర్రి రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీ నిర్వహించని కార్యక్రమం ప్రస్తుతం వైసీపీ చేస్తోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసిన మంచిని వివరించామని, పార్టీలు, కులాలకు అతీతంగా జగన్ ప్రభుత్వం మేలు చేస్తోందని తెలిపారు. అలా చేయడం వల్లే ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లగలుగుతున్నట్లు వెల్లడించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ చేసి చూపించడమే ప్రభుత్వ  లక్ష్యమని ఎంపీ అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పి చేసిన అంశాలు ప్రతి ఇంటిలో చెప్పాలనేది జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్ లో ఇంకా మెరుగైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనేది సీఎం జగన్ ఉద్దేశమని వెల్లడించారు. ఒక పెద్ద సర్వేగా ఈ కార్యక్రమం ఉండబోతోందని ఎంపీ అయోధ్య రామిరెడ్డి చెప్పుకొచ్చారు. 


ప్రజల గుండెల్లోంచి వచ్చిన నినాదమే మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమమని ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ  కార్యకర్తగా ప్రజా ప్రతినిధిగా నేను ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్తున్నానని పేర్కొన్నారు. ఒక సామాజిక కుట్ర ప్రస్తుతం జరుగుతోందని, బీసీలకు ఇచ్చే పదవులు చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు.. బీసీలకు మంచి హోదా పదవులు  ఇచ్చింది జగన్ మాత్రమేనని అన్నారు.