ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను క్యాసినో కుదిపేసింది. మంత్రి హోదాలో ఉన్న గుడివాడ వైసీపీ శాసన సభ్యుడు కొడాలి నాని గతేడాది తన నియోజకవర్గం గుడివాడ పరిధిలో భారీగా క్యాసినో నిర్వహించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహరం తీవ్రస్థాయిలో దుమారాన్నిరాజేసింది. టీడీపీతోపాటుగా ఇతర రాజకీయ పార్టీలు అన్ని కొడాలి నానిని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించాయి. 


కొడాలి నానికి వ్యతిరేకంగా ఛలో గుడివాడ పేరుతో టీడీపీ నేతలు ఆందోళనకు పిలుపునివ్వటం, టీడీపీని ఎదుర్కొనేందుకు వైసీపీ శ్రేణలు సైతం రోడ్ల మీదకు రావటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. గుడివాడ రణరంగంగా మారింది. రెండు వర్గాలను చెదరకొట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. రెండు పార్టీలకు చెందిన నాయకుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. శాంతి భద్రతలకు సంబందించిన సమస్య తలెత్తటంతో ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులు రెండు నెలల పాటు గుడివాడలో ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. 


రాష్ట్ర స్థాయిలో ఈ వ్యవహరం తీవ్ర చర్చనీయాశంగా మారింది. సీఎం జగన్ సైతం గుడివాడ క్యాసినో వ్యవహరం పై కొడాలి నానితో మాట్లాడి అసలు విషయాలను తెలుసుకున్నారు. కొడాలి నాని కూడా ఈ వ్యవహరంపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి ప్రయత్నించారు. దీంతో రాజకీయం వేడెక్కింది. టీడీపీ శ్రేణులను తరిమి కొడతామంటూ కొడాలి హెచ్చరించారు. సీఎం కూడా క్యాసినో విషయంలో తనను ఏమి అనలేదని కొడాలి నాని వివరణ ఇచ్చారు.


ఎడాది పూర్తి కావటంతో...


గుడివాడలో మెదలైన క్యాసినో వ్యవహరం భారీ ఎత్తున రాజకీయ వేడి రగిలించటంతో ఇప్పటికీ ఈ వ్యవహరం ఇంకా చర్చ నడుస్తుంది. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో కొడాలి నాని కీలక పాత్రపోషించారనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. క్యాసినోతో సంబంధం లేదని కొడాలి నాని వివరణ ఇచ్చినప్పటికీ వివాదం మాత్రం ఆగలేదు. గుడివాడ నియోజకవర్గంలో స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకులకి తెలియకుండా క్యాసినో అంత భారీ స్థాయిలో నిర్వహించటం సాధ్యమా అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. భారీగా ఆందోళనలు చేశాయి. మాజీ మంత్రి పేర్ని నాని వారసుడు పేర్ని కిట్టు కూడా క్యాసినోలో పాల్గొన్నారని అందుకు సంబంధించిన ఫొటోలను కూడా టీడీపీ విడుదల చేసింది.


ఈ వ్యవహరానికి ఎడాది పూర్తికావస్తుండటంతోపాటుగా ఈ సంక్రాంతికి క్యాసినో లేదా అంటూ టీడీపీ నేతలు, సానుభూతిపరులు ట్రోల్స్ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో నానిని ఉద్దేశించి పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ ఎడాది క్యాసినో లేదా అంటూ గడ్డం పుష్ప అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్‌ను టీడీపీ నేత బుద్దా వెంటకన్న స్టార్ట్ చేశారు. దీంతో మిగతా టీడీపీ లీడర్లు అందుకున్నారు. వారి అనుచరులు షేర్ చేస్తున్నారు.