టీడీపీ పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా ఉందని, కచ్చితంగా విజయం సాధిస్తాం అనే నమ్మకం ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతో ఏపీ ప్రజలు విసుగు చెందారన్నారు. తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సోమవారం దర్శించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అశోక్ బాబు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఈయనకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రద ప్రసాదాలు అందజేశారు. 


శ్రీవారి దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు నిలబడ్డారో వారు నేటి నుండి ప్రచారం కొనసాగించే నేపథ్యంలో స్వామి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగిందన్నారు. టీడీపీ పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పార్టీకి అనుకూలంగా ఉందని, కచ్చితంగా విజయం సాధిస్తాం అనే నమ్మకం ఉందన్నారు.. ప్రభుత్వం జరుగుతున్న అరాచకాలతో ప్రజలు విసుగు చెందుతున్నారని, ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక, ఉపాధి లేక చాలా నిరుత్సాహంగా ఉన్నారని చెప్పిన ఆయన, యువత టీడీపీ బ్రహ్మరథం పడుతుందని ఆయన చెప్పారు. 


సమాజంపై వైసీపి దాడి చేస్తుందని, జనసేన, బిజేపి, టీడీపీ నాయకులు అని తేడా లేకుండా అందరిపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దౌర్జన్యాలను కలిసి ఎదుర్కోవాలని అన్ని పార్టీలు ఓ నిర్ణయానికి రావడం జరిగిందని, అయితే గతంలో విజయవాడలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షఉడు పవన్ ను కలిశారు. కనుక ఆదివారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ సైతం మర్యాద పూర్వకంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబును కలిశారని, రాబోయే ఉద్యమాలు అన్ని‌ కూడా కలిసి పాల్గోనాలి అనే ఇద్దరు చర్చించడం జరిగిందన్నారు.


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‎లోని జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ ఆదివారం (జనవరి 8) మధ్యాహ్నం వెళ్లారు. వీరిద్దరు భవిష్యత్తులో రాజకీయంగా కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే కోణంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికల ఊహాగానాల వేళ రెండు పార్టీల పొత్తును ఇప్పుడే ప్రకటించాలా? లేదంటే కొంతకాలం వేచి ఉండాలా? అనేది మాట్లాడుతుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష సభలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు వంటి అంశాలపై మాట్లాడుకోనున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌-1పైన కూడా తాజా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. 


విశాఖలో పవన్ కళ్యాణ్‎ను అడ్డుకున్న సమయంలో చంద్రబాబు పవన్ కల్యాణ్‎ను కలిసి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఉన్న పవన్ కల్యాణ్ వద్దకు అప్పుడు చంద్రబాబు స్వయంగా వెళ్లి కలిశారు. ఆయన్ను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంపై పరామర్శించారు. మళ్లీ ఇప్పుడు మూడు నెలలు గడవక ముందే పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పర్యవసానాల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.