Mandali Buddha Prasad Arrest: టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మట్టి అక్రమ రవాణాపై పోరాటానికి బయలుదేరిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మట్టి మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలతో కలిసి నాగాయలంక ఎమ్మార్వో ఆఫీసు ముట్టడికి బయలు దేరిన బుద్ధప్రసాద్ ను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. మండలి బుద్ధప్రసాద్ ను పోలీస్ జీప్ లో కోడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అవనిగడ్డలోని తన ఇంటి వద్ద నుంచి టీడీపీ కార్యకర్తలతో కలిసి నాగాయలంక బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో కాసేపు ఉద్రికత్త చోటుచేసుకుంది. బుద్ధప్రసాద్ ఆయన ఇంటి సమీపంలోనే అడ్డుకున్న పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పోలీసుల వాహనానికి అడ్డుగా బైఠాయించి ఆయన అరెస్టుకు నిరసన తెలిపారు.
తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రైతులు, సామాన్య ప్రజానీకం చేస్తున్న పోరాటాన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపడం, ర్యాలీ చేయడానికి అనుమతించకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని బుద్ధప్రసాద్ అన్నారు. తనను అరెస్ట్ చేసినా ఈ ఉద్యమం ఆగదనీ, బాధిత వర్గం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. అవనిగడ్డలో జరిగిన డాక్టర్ శ్రీహరి హత్య కేసును ఛేదించలేదు కానీ, పోలీసులు తమపై ప్రతాపం చూపిస్తున్నారంటూ బుద్ధప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు.
మైనింగ్ డిపార్ట్ మెంట్, రెవెన్యూ డిపార్ట్ మెంట్, ఇతర శాఖలు తమ పనిని సక్రమంగా నిర్వర్తించడం లేదని బుద్ధప్రసాద్ ఆరోపించారు. ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలు సామాన్యులు, రైతులకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. డాక్టర్ శ్రీహరి చనిపోతే ఏం జరిగిందో తేల్చలేకపోయారు. కానీ శాంతియుతంగా పోరాడుతున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని కాపాడలేని వారు మమ్మల్ని రక్షిస్తారా, మాకు న్యాయం చేస్తారా అంటూ మండిపడ్డారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి, జై మండలి అంటూ టీడీపీ కార్యకర్తలు కోడూరు పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు.
పోలీసుల తీరును ఖండించిన టీడీపీ నేతలు
మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేస్తున్న వారిని ఏ కారణంతో అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. మట్టి మాఫియాను అడ్డుకోవాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను అడగటమే బుద్ధ ప్రసాద్ చేసిన తప్పిదమా అని అంటున్నారు. బుద్ధప్రసాద్ పిలుపు మేరకు నాగాయలంక ఎమ్మార్వో ఆఫీసుకు బయలుదేరిన కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కూడా కోడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.