AP Road Accident: ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం నలుగురు దుర్మరణం చెందగా.. 75 మంది గాయాలపాలయ్యారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని మడికి 216(ఏ) జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున సుమారు నాలుగు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రావులపాలెం సర్కిల్ సీఐ రజని కుమార్, స్థానిక ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముందుర్తి గ్రామానికి చెందిన 9 మంది వ్యక్తులు ఏపీ 35 డబ్ల్యూ 2306 నెంబర్ గల టాటా ఏసీ పై మందపల్లికి దైవ దర్శనానికి ప్రయాణం అయ్యారు. అలాగే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద నుండి పాలకొల్లు వెళ్తున్న ఏపీ 39సీ 2266 నెంబర్ గల ఫోర్డు టైటానియం కారు వస్తోంది. ఈక్రమంలోనే వేగంగా వస్తున్న కారు టాటాఎసీ వాహనాన్ని ఢీకొట్టింది. 


టాటాఏసీలోని ముగ్గురు, కారు డ్రైవర్ దుర్మరణం - 9 మందికి తీవ్ర గాయాలు


ఈ ప్రమాదంలో టాటా ఏసీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా.. కారులో డ్రైవర్ కూడా చనిపోయారు. మిగిలిన 9 మంది కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన వారు రంగంలోకి దిగారు. వెంటనే క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంబులెన్స్ సిబ్బంది వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.శివ ప్రసాద్ తెలియజేశారు. రహదారిపై ప్రమాదం జరగడంతో... ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణను చేపట్టారు. 


పంటబోదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు


పెదపారుపూడి మండలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి గుడివాడ వస్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు వానపాముల వద్ద అదుపుతప్పడంతో పక్కనే ఉన్న పంట బోధిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 68 మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందు వెళ్తున్న ఆటో సడన్ బ్రేక్ వేయడంతో.. దాన్ని డ్రైవర్ తప్పించబోయాడు. అయితే ముందు గుంతలు ఉండడంతో అదుపు తప్పిన బస్సు పంట పొలాల్లోకి వెళ్లిందని బస్సు డ్రైవర్ తెలియజేశాడు. గుడివాడ కంకిపాడు రహదారిపై తరచూ ప్రమాదాల జరుగుతున్నాయి. రహదారి సరిగ్గా లేక అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి రోడ్డు బాగు చేయిస్తే.. అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం చేయనున్నారో.