ఎమ్మెల్సీ అశోక్‌బాబు(Ashok Babu) అరెస్టుతో మరోసారి అధికార వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP), ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. 


టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు(Chandra Babu) చేసిన విమర్శలపై మంత్రి కొడాలి నాని(Kodali Nani) స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తప్పు చేస్తే ఏ బాబునైనా సీఐడీ అరెస్టు చేస్తుందని... అశోక్‌బాబును అదే తీరున అరెస్టు చేసిందన్నారు. వ్యక్తిగతంగా కూడా చంద్రబాబును దూషించారు. 


మంత్రి కొడాలి నాని కామెంట్సపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma Maheswararao) ఘాటుగా స్పందించారు. నాని పొగరు అణుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అంకుశం సినిమాలో  రామిరెడ్డికి పట్టిన గతి కొడాలి నానికి పడుతుందని ఫైర్ అయ్యారు. 


చంద్రబాబు కాళ్లు పట్టుకొని ఉద్యోగం తెచ్చుకున్న కొడాలి నాని... ఇప్పుడు జగన్ కాళ్లు పట్టుకుంటున్నారంటూ ఘాటు కామెంట్స్ చేశారు.  


క్యాసినోతోపాటు దాని వెనుక నాని చేసిన పనుల గురించి మాట్లాడాలంటే సంస్కారం అడ్డొస్తోంది అన్నారు ఉమ. సన్నబియ్యం ఇవ్వలేని వ్యక్తులు మాట్లాడుతుంటే బాధనిపిస్తోందన్నారు. 


భూతులు తిట్టడం, క్యాసినో ఆడించడం తప్ప తన శాఖపై కొడాలి నానికి పట్టులేదన్నారు దేవినేని ఉమ. ఇంత వరకు ధాన్యం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. అశోక్‌బాబుపై పెట్టిన తప్పుడు కేసులకు అధికారులందరూ కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు ఉమ.  


విషయం ఏదైనాసరై దేవినేని ఉమ, కొడాలి నాని మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తుంది. ఇద్దరూ వ్యక్తిగత దూషణల విషయం వెనుకాడరు. ఢీ అంటే ఢీ అన్నట్టు సాగుతుంది ఈ ఇద్దరి మధ్య వార్. ఇప్పుడు అశోక్‌బాబు అరెస్టు అంశంపై కూడా అదే స్టైల్‌లో వార్‌ షురూ అయింది. దీన్ని అక్రమమైన అరెస్టుగా తెలుగుదేశం జనాల మధ్యకు తీసుకెళ్తుంటే... తప్పు చేశారు కాబట్టే ఊచలు లెక్కిస్తోందని అధికార పార్టీ కౌంటర్ అటాక్‌ మొదలు పెట్టింది. 


తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగం సంపాదించి ప్రమోషన్లు పొందారంటూ సహోద్యోగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేస్తూనే మొన్న అర్థరాత్రి అశోక్‌ను అరెస్టు చేసింది. దీన్ని తెలుగు దేశం పార్టీ నాయకులంతా తీవ్రంగా ఖండించారు. ఇదంతా కక్షసాధింపులో భాగంగానే అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. 


అశోక్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేశారు. ఉయ్‌ స్టాండ్‌ఫర్ అశోక్‌ అంటూ పోస్టులు పెట్టారు. కేసు అంత తీవ్రమైంది కాదని.. అశోక్‌ సాక్ష్యాలను తారుమారు చేసే స్థితిలో లేరని అభిప్రాయతం మెజిస్ట్రీయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన రిటైర్‌ అయిన ఉన్నందున సాక్ష్యాలను మార్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఆయనకు నిన్న రాత్రి బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగానే మాట్లాడిన దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.