Chandrababu Krishna District Visit: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం (ఏప్రిల్ 12) నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, సభల్లో ప్రసంగిస్తారు. 13వ తేదీ నిమ్మకూరులో నిర్వహించే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో తెలుగు దేశం అధినేత చంద్రబాబు పాల్గొంటారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు రోజుల షెడ్యూల్...
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు షెడ్యూల్ ఖరారు అయ్యింది. మూడు నియోజకవర్గాల పరిధిలో జరిగే కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. బుధవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయం నుండి చంద్రబాబు పర్యటన ప్రారంభం అవుతుంది. విజయవాడ నగరంలోని రాణిగారి తోటకు చేరుకొని చంద్రబాబు అక్కడే నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాణిగారి తోట నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు కృష్ణా జిల్లా మచిలీపట్టణంలోని మూడు స్తంభాల సెంటర్ కు చేరుకుంటారు. ఇందులో భాగంగా చంద్రబాబు విజయవాడ సమీపంలోని పోరంకి నుంచి మంటాడ, గూడూరు బైపాస్ మీదగా రోడ్ షో ఉంటుంది. మచిలీపట్టణం రామానాయుడు పేటలోని వెంకటేశ్వర స్వామి వారిని  చంద్రబాబు దర్శించుకుంటారు. అక్కడ నుంచి మచిలీపట్టణంలోని హిందూ కాలేజీకి చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు పామర్రు మండలంలోని నిమ్మకూరుకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు.
గుడివాడలోనే చంద్రబాబు బస...
ఈ 13వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల తరువాత చంద్రబాబు నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొటారు. అక్కడ నుంచి బస్ స్టాండ్ సెంటర్, నెహ్రూ చౌక్, గుడివాడ బైపాస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో సాగుతుంది. గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. గుడివాడలోని వీకేఆర్, కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అదే కాలేజిలలో చంద్రబాబు రాత్రి బస చేస్తారు. గుడివాడలో ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో చంద్రబాబు పర్యటన, రాత్రి బస కూడా గుడివాడలోనే ఏర్పాటు చేయటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ 14వ తేదీన నూజివీడులో జరిగే సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
బందరు పోర్ట్ పై చంద్రబాబు కీలక ప్రకటన..
ఇదేమి కర్మరా రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు బహిరంగ సభకి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మచిలీపట్నం హిందూ కాలేజీలో ఏర్పాట్లను మాజీ మంత్రి దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ, బోండా ఉమామహేశ్వరరావు, పలువురు నేతలు పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బందర్ పోర్టు కోసం 52 రోజులు పోరాటం చేస్తే ఏమైపోయిందని ప్రశ్నించారు. వీటన్నిటిపై నాయకుడు చంద్రబాబు కీలక ప్రకటన చేస్తారని చెప్పారు. చంద్రబాబు రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని భారీ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబుపై మండిపడ్డ క్రైస్తవ సంఘాలు..
టీడీపీ అధినేత చంద్రబాబు పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ నేతలు ఫైర్ అయ్యారు. క్రైస్తవ సమాజాన్ని కించ పరిచిన చంద్రబాబు, క్రైస్తవ సంఘాలతో ఎలా సమావేశమవుతారని, క్రిస్టియన్ సెల్ నేతలు ప్రశ్నించారు. గుడివాడ వైసిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర నాయకులు వెంపటి సైమన్, విక్టర్ పాల్ తదితర నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బలవంతంగా క్రైస్తవ మతమార్పిడులు జరుగుతున్నాయని బహిరంగ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, నేడు క్రైస్తవుల ఓట్ల కోసం సమావేశాలు నిర్వహించడాన్ని క్రిస్టియన్ సెల్ నేతలు ఖండించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సమాధానం చెప్పిన తర్వాతే, గుడివాడలో క్రైస్తవ సంఘాలతో  సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అందరూ బాగుండాలనే క్రైస్తవ సమాజం ప్రార్థనలు చేస్తుందే తప్ప, బలవంతపు మత మార్పిడులు చేసిన చరిత్ర క్రైస్తవ సంఘాలకు లేదని క్రిస్టియన్ సెల్ నాయకులు స్పష్టం చేశారు. చంద్రబాబు మాయలో క్రైస్తవులపై జరిగిన దాడులను నేటికి మరచిపోలేదని వారు పేర్కొన్నారు.