ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డెక్కారు. వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఎమ్మార్పీఎస్ ధర్నా రక్తసిక్తమైంది. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ నాయకులు ఆందోళన చేయడం... వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి హీటెక్కింది. రాళ్లు రువ్వుకునే పరిస్థితి తలెత్తింది.
వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని ఎమ్మార్పీఎస్ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ యడ్రాతి కోటేశ్వరరావు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. వర్గీకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారీ జన సమూహంతో కీసర గ్రామంలో నేషనల్ హైవే మీద చేసిన ధర్నా కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల కొద్ది నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాధ్, మహిళా నాయకురాలు జ్యోతి , గుండాల ఈశ్వరయ్య గుండాల ఈశ్వరయ్య, శివ నారాయణ, కత్తి ఓబులేసు, గజ్జల బాలయ్య, మారన్న, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. హైవేపై ఆందోళన చేస్తున్న వారిని తరిలించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే సీన్ హీట్ ఎక్కింది. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆందోళనకారులు ప్రతిఘటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడ ఉన్న వారిని స్టేషన్‌కు తరలించేందుక యత్నించారు. అయితే వారిపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేయడంతో కొందరు పోలీసులకు గాయాలు అయ్యాయి.
అతికష్టమ్మీద అక్కడ ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కిలోమీటర్ల నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.