ఎన్టీఆర్‌ జిల్లాలో కలకలం రేగింది. గుప్త నిధుల పేరుతో ఓ బాలుడినే బలి ఇచ్చేందుకు యత్నిస్తున్నారన్న సమాచారం అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మూఢనమ్మకాలతో  కొందరు మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. కోట్ల విలువైన గుప్త నిధులు దొరుకుతాయని నమ్మి దారుణాలకు పాల్పడుతున్నారు.

  


ఎన్టీఆర్ జిల్లా చౌటపల్లి గ్రామంలో అర్థరాత్రి క్షుద్ర పూజలు చేస్తున్నారన్న సమాచారంతో గ్రామస్థులు  భయాందోళన చెందుతున్నారు. ధైర్యం చేసిన కొందరు గ్రామస్థులు తిరువూరు మండలం టేకులపల్లి- చౌటపల్లి గ్రామాల సరిహద్దుల వద్దకు వెళ్లగా... అక్కడ కొంతమంది గుంపుగా నిలబడి ఉన్నారు. వారితో పూజారులు, ఓ బాలుడు కూడా ఉన్నాడు. అంతేకాదు ఆ బాలుడి తండ్రి కూడా గుంపులో ఉన్నాడు. ఎందుకు వచ్చారు ఇక్కడ ఏం చేస్తున్నారని గ్రామస్థులు ప్రశ్నిస్తే వాళ్లు పొంతన లేని సమాధానాలు చెప్పారు. బాలుడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. 
అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు ఫోన్ చేశారు. బాలుడిని నరబలి ఇచ్చేందుకు తీసుకొచ్చారని... వెంటనే రావాలని సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకెళ్లారు. 


గుప్త నిధుల కోసమే ఎనిమిది మంది సభ్యులు గ్రామశివార్లోకి  వచ్చారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వీళ్లంతా బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులని చెబుతున్నారు. మొత్తం 8 మంది గుప్తనిధుల ముఠాలో నలుగురు పారిపోయారని తెలిపారు. నలుగురు మాత్రమే తమకు చిక్కారని వారిని పోలీసులకు అప్పగించినట్టు వివరించారు. బాలుడిని అడిగితే ఏవో పూజలు అన్నాడని గ్రామస్థులు తెలిపారు. తన తండ్రి పిలిస్తే తాను అక్కడకు వచ్చానంటూ బాలుడు ఏడుస్తూ చెప్పాడన్నారు. తాను ఏ తప్పు చేయలేదని బాలుడు తెలిపాడు.  


ఓ కారు మూడు బైక్‌లలో ఈ ముఠా వచ్చినట్టు చెబుతున్నారు గ్రామస్థులు. వాళ్లు అనుకున్న ప్లాన్ వర్కౌట్‌ అయితే వెళ్లిపోవడానికి ఆ వెహికల్స్‌ను రెడీ చేసినట్టు చెబుతున్నారు. ఓ దిక్కున కారు, బైక్‌, మరో మూలన రెండు బైక్స్‌ ఉంచినట్టు పేర్కొన్నారు. గ్రామస్థులు తమను గమనించారని గ్రహించిన ముఠాలోని నలుగురు సభ్యులు రెండు బైక్స్‌ వేసుకొని పరారైనట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.