న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు ప్రోత్సాహమిస్తే బాగుంటుందని సూచించారు.
తెలుగులో ప్రసంగం
పదేళ్ల క్రితం నూతన కోర్టు భవనాలకు తానే శంకుస్థాపన చేశానని.. ఇప్పుడు వాటిని తానే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ+7 నూతన భవనాలను ఈ ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ‘వక్తలంతా ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించారు. సీఎం తెలుగులో మాట్లాడాక.. తాను మాట్లాడకపోతే బాగుండదు. నేను, సీఎం జగన్ తెలుగులో ప్రసంగించడం సంతోషకర విషయం. కోర్టు భవన నిర్మాణాలు పూర్తికావడం చాలా సంతోషించదగ్గ విషయం. రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, నిధుల జాప్యంతో ఈ భవనాల నిర్మాణం ఆలస్యమైంది. జాప్యం వల్ల లాయర్లు, జడ్జీలు, బార్ అసోసియేషన్ సభ్యులు ఇబ్బందిపడ్డారు. ఇప్పటికీ ఈ కాంప్లెక్స్ పూర్తికావడం సంతోషదాయకం. పూర్తయిన భవనాలను సక్రమంగా వినియోగించుకోవాలి".
కేంద్రం సహకరించాలి
‘ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉంది. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చాం. భవనాల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని కోరాను. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భవనాల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తే సహకరించినట్లవుతుంది. ఇక న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. న్యాయవ్యవస్థను పటిష్ఠ పరిచే కార్యక్రమాల్లో భాగస్వామ్యం తప్పనిసరి. సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలి. సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు ప్రోత్సాహమిస్తే బాగుంటుంది. చాలా మంది గొప్ప మనసుతో నన్ను ఆదరించి పైకి తీసుకువచ్చారు. ఈ నెల 27న పదవీ విరమణ చేయబోతున్నా. నా ఉన్నతికి, విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
సీఎం సహకరించారు
‘రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సహకరిస్తానని సీఎం జగన్ అన్నారు. నిర్మాణాల పూర్తికి సీఎం సహకరించారు. విశాఖలో కూడా కొన్ని భవనాల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. విశాఖలో భవన నిర్మాణాల పూర్తికి సీఎం సహకరిస్తారని ఆశిస్తున్నా’ అని జస్టిస్ ఎన్.వి. రమణ పేర్కొన్నారు.
ఇది గుర్తుండిపోయే ఘట్టం: జగన్
‘విజయవాడలో నూతన జిల్లా కోర్టు భవనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సీజేఐ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. 2013లో జస్టిస్ ఎన్.వి. రమణ చేతులమీదుగా భూమిపూజ జరిగింది. నిర్మాణాల ప్రారంభోత్సం కూడా ఆయన చేతులమీదుగానే జరిగింది. ఇది గుర్తుండిపోయే ఘట్టం. న్యాయవ్యవస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. న్యాయవ్యవస్థకు చెందిన ప్రతి విషయంలో సహకారానికి సిద్ధం’ అని సీఎం జగన్ ప్రకటించారు.