విజయవాడలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. విజయవాడ కోర్టుతో జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సిటీ సివిల్‌ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్‌ కలిసి మొక్క నాటారు. 


సీజేఐతో సీఎం భేటీ


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం విజయవాడకు చేరుకున్న ఆయనను సీఎం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జస్టిస్ రమణతో ముఖ్యమంత్రి మీటింగ్ జరిగింది. సీఎం జగన్ వెళ్లిన అనంతరం సీజేఐతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సీజేఐతో సుమారు 15- 20 నిమిషాలపాటు చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ చంద్రబాబు కాన్వాయ్‌లు క్లాష్ కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. 






నెరవేరిన 9ఏళ్ల కల


సీజేఐ ప్రారంభించిన కోర్టు భవనాల నిర్మాణ పనులు.. 9ఏళ్ల సుదీర్ఘ కాల పాటు జరిగాయి. నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో సుమారు 100కోట్ల రూపాయ‌ల వ్యయంతో ఈ 9 అంత‌స్తుల భ‌వనాన్ని నిర్మించారు. 2013లోనే శంకుస్థాపన జరిగినా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తి కావ‌టానికి 9సంవ‌త్సరాలు ప‌ట్టింది. చాలాకాలం నత్తనడకన పనులు సాగగా... మధ్యలో కరోనా కారణంగా రెండున్నర సంవ‌త్సరాల‌కు పైగా నిర్మాణం ఆగిపోయింది. ఆ త‌ర్వాత కూడా బిల్లుల చెల్లింపులు ఆల‌స్యం అయినందువల్ల పనులు ముందుకు సాగలేదు. పలువురు న్యాయ‌వాదులు హై కోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేయాల్సి వచ్చింది. తర్వాత న్యాయ‌స్దానం ఆదేశాలతో ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. ఎట్టకేల‌కు 3.70ఎక‌రాల్లో 9 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తైంది. ఇవాళ ప్రారంభోత్సవం కూడా జరిగింది. 


సీజేఐకు డాక్టరేట్


విజయవాడ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడంతోపాటు యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్‌ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పట్టేటి రాజశేఖర్‌ తదితరులు పాల్గొంటారు.