ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాత్‌రెడ్డి(34) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని పవిత్ర అపార్ట్‌మెంట్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంత కాలంగా భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే మనస్థాపంతో ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 


కుంచనపల్లిలోని పవిత్ర అపార్ట్‌మెంట్‌లో 101వ ప్లాట్‌లో మంజునాథ్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. ఈ ప్లాట్‌కు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం ఈ ప్లాట్‌కు వచ్చిన మంజునాథ్‌రెడ్డి శుక్రవారం శవమై కనిపించారు.


మంజునాథ్‌రెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం పప్పిరెడ్డిగారెపల్లి. పీఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ యజమాని అయిన మహేశ్వర్‌రెడ్డే మంజునాథ్ తండ్రి. కుమారుడి మరణవార్త తెలియగానే హుటాహుటిని విజయవాడ బయల్దేరి వెళ్లారాయన. మంజునాథ్‌ మృతిపై మొదట సోషల్ మీడియాలో వెలుగుచూసింది. దీనిపై రకరకాలుగా ప్రచారం జరిగింది. చివరకి పోలీసులు దీన్ని ఆత్మహత్యగా తేల్చారు. 


మంజునాథ్‌ తండ్రి మహేశ్వర్ రెడ్డి కూాడా వైసీపీలో ఉన్నారు. మంజునాథరెడ్డి భార్య స్రవంతి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కాశ్మీర్‌తోపాటు పలు రాష్ట్రాల్లో చేసిన పనులకు రాంకీ సంస్థ నుంచి తమ కంపెనీకి బిల్లులు రావాల్సి ఉందని… బ్యాంకుల నుంచి సకాలంలో ఫైనాన్స్ అందలేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో తన కుమారుడు కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు. మంజునాథ్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన మృతదేహం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో ఉంది.