Sharmila Son Raja Reddy Marriage : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు (Apcc Chief Sharmila Reddy) వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి (Ys Rajareddy ), అట్లూరి ప్రియ (Atluri Priya)వివాహం...ఈ నెల 17న జరగనుంది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ (Jodhpur)లోని ఉమైద్ భవన్ లో 16 నుంచి 18 వరకు... మూడు రోజుల పాటు అట్టహాసంగా వివాహ మహోత్సవం జరగనుంది. షర్మిల కుటుంబసభ్యులు జోధ్ పూర్ ప్యాలెస్ కి చేరుకున్నారు. 16 న సంగీత్, మెహందీ వేడుక, 17న సాయంత్రం 5.30 గంటలకు వివాహం, 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. గత నెల 18న హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులతో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్ లో విందు
రాజస్థాన్‌లో వివాహ వేడుక జరగనుండటంతో రెండు కుటుంబాలు రాజస్థాన్ చేరుకున్నాయి. షర్మిలా రెడ్డి ప్రస్తుతం వివాహ పనుల్లో నిమగ్నమయ్యారు. వివాహం అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసిప్షెన్ కు నిర్ణయించారు. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విందుకు హాజరుకానున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాతే రాజకీయ కార్యకలాపాల్లో షర్మిల పాల్గొనున్నట్లు తెలుస్తోంది. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించారు. తొలి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్సార్ ఘాట్‌లో ఉంచి, తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు.
అమెరికాలో లవ్ లో పడ్డ రాజారెడ్డి, ప్రియా అట్లూరి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రాజారెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమలో పడ్డారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు అయినా ప్రేమించుకోవడంతో ఇంట్లో పెద్దలు అంగీకారం తెలిపారు. ప్రియా అట్లూరి అమెరికాలో ఉంటున్నారు. ఆమెకు యూఎస్ఏ పౌరసత్వం కూడా ఉంది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త, చట్నీస్ సంస్థల అధినేత అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలు. వైఎస్ రాజారెడ్డికి ప్రియా అమెరికాలోని చర్చిలో పరిచయం అయినట్లు తెలుస్తోంది.