Prakasam Barrage: విజయవాడ వాసులను భయాందోళనకు గురిచేసిన ప్రకాశం బ్యారేజీకి ఢీకొన్న బోట్లను తొలగించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం నీటి అడుగున ఉన్న మరో బోటును బయటకు తీసి ఒడ్డుకు చేర్చడంలో బెకెం ఇన్‌ఫ్రా ఇంజినీర్లు విజయం సాధించారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకుపోయిన రెండో బోటును ఇంజనీర్లు సక్సెస్ ఫుల్ గా తొలగించారు. నీట మునిగిన బోటును చైన్‌పుల్లర్‌లతో పైకి లేపి రెండు బోట్లను ఇనుప గడ్డర్లతో అనుసంధానం చేసి వెలికి తీశారు. రెండో బోటును బ్యారేజీ పైనున్న పున్నమి ఘూట్ వద్దకు తీసుకొచ్చారు. బెకెం ఇన్‌ఫ్రా  ఇంజనీర్స్ ఎట్టకేలకు సరికొత్త ప్లాన్‌తో రెండు భారీ పడవలను బయటకు తీశారు. తొమ్మిది రోజులుగా బ్యారేజీ గేట్ల వద్ద అడ్డంగా ఉన్న మూడు బోట్లను తొలగించేందుకు ఇంజనీర్లు, అధికారులు తమ శాయశక్తులా ప్రయత్నించగా రెండు బోట్లను బయటకు తీసుకొచ్చారు. బ్యారేజీ వద్ద మరో భారీ, మోస్తరు బోటును ఒడ్డుకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


100టన్నులకు పెరిగిన బోటు బరువు
ఎట్టకేలకు బెకెం ఇన్‌ఫ్రా ఇంజినీర్లు 40 టన్నుల బరువైన పడవను నిన్న ఒడ్డుకు చేర్చారు. బ్యారేజీ వద్ద ఇసుక, నీరు నిలిచి బోటులోకి రావడంతో బోటు బరువు దాదాపు 100 టన్నులకు పెరిగిందని అధికారులు తెలిపారు. బోటు బరువు ఎక్కువగా ఉండడంతో అధికారులు కొత్త పద్ధతిలో పనులు చేపట్టారు. ఒడ్డుకు తీసుకొచ్చిన బోటును కిలోమీటరు దూరంలోని పున్నమి ఘాట్ వద్దకు తీసుకొచ్చారు. బ్యారేజీ వద్ద ఇంకా బోల్తా పడి ఉన్నటు వంటి మూడో బోటును రేపు బయటకు తీసి ఒడ్డుకు తరలించే యత్నాన్ని చేయనున్నారు.


బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు
నిన్న ఒక బోటును బయటకు తీసిన నిపుణులు నిన్నటి ప్రయత్నంతోనే రెండో బోటును ఈ రోజు బయటకు తీశారు. ఈ నెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి వచ్చిన 5 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను బలంగా తాకాయి. ఫలితంగా, 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్‌లు ధ్వంసమయ్యాయి. ఒక బోటు ప్రవాహంలో కొట్టుకుపోగా, మరో మూడు భారీ పడవలు, ఒక మధ్యస్థ పడవ గేట్ల వద్ద చిక్కుకుపోయాయి. ఈ బోట్లు బ్యారేజీ గేట్లను అడ్డం పడి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో భారీ బోట్లను తొలగించేందుకు ఎన్నో ప్రణాళికలు అమలు చేసిన అధికారులు తాజాగా సఫలీకృతులయ్యారు.


సక్సెస్ అయిన చివరి ప్రయత్నం
దాదాపు తొమ్మిది రోజులుగా గేట్ల దగ్గర ఉన్న బోట్లను తొలగించడంలో ప్లాన్ ఎ విఫలమైంది. ప్లాన్ బి ఫ్లాప్ అయింది. ప్లాన్ సి వర్తింపజేయబడలేదు. చివరకు అబ్బులు టీమ్ కూడా చేతులెత్తేసింది. బెకెం ఇన్‌ఫ్రా కంపెనీ కొత్త ప్లాన్‌తో అడుగుపెట్టింది. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర ఇరుక్కుపోయిన బోట్లను వాటర్ లోడింగ్ సిస్టమ్‌తో వెలికి తీయడంలో పురోగతి సాధించింది. రెండు పడవలను విజయవంతంగా బయటకు తీశారు. మిగిలిన బోటును రేపు రికవరీ చేస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు. అసాధ్యం కాదనుకున్నది సుసాధ్యమైంది. అధికారుల తొమ్మిది రోజుల శ్రమ ఫలించింది. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది.