CI Nagaraju | అమరావతి: సాయికృష్ణ హత్యకేసు వివాదంతో సస్పెండయిన కృష్ణలంక సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజుతో న్యాయాధికారి శ్రీకాంత్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. 12 రోజుల పోలీస్ కస్టడీ కోరడంపై నిందితుడు నాగరాజు అభిప్రాయాన్ని అడగ్గా.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనను ఇందులో ఇరికించారని చెప్పాడు. కస్టడీకి ఇస్తే పోలీసులు తనను శారీరకంగా ఇబ్బంది పెడతారని, తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. దీనిపై అభ్యంతరాలను జైలు అధికారుల ద్వారా ఈ-మెయిల్ చేయాలని సూచించిన న్యాయాధికారి, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
సంచలనం సృష్టించిన సాయికృష్ణ హత్య కేసులో నిజాలు బయటకు రావాల్సి ఉందనీ, ప్రధాన నిందితుడైన నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం కోరింది. ఈ మేరకు సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ మంగళవారం రెండో AJMFC కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది సత్యవాణి కోర్టులో వాదనలు వినిపించారు. మృతదేహాన్ని మాయం చేసిన విధానం, సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయడం, రక్తపు మరకలున్న వస్తువుల వెనుక ఉన్న నిజా నిజాలను రాబట్టడానికి నిందితుడిని 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.
నిందితుడి తరఫు లాయర్ల అభ్యంతరాలుమరోవైపు, నిందితుడైన సీఐ నాగరాజు తరఫు న్యాయవాదులు రామచంద్రరావు, సాంబయ్య ఈ కస్టడీ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే నిందితుడు 24 గంటల పాటు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడని, ఇప్పుడు మళ్లీ 12 రోజులు కస్టడీకి ఇస్తే తప్పుడు వాంగ్మూలం కోసం పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా హింసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ కోర్టు కస్టడీకి అనుమతించాలనుకుంటే కేవలం రెండు రోజులు సరిపోతుందని, విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. లేనిపక్షంలో రాజమహేంద్రవరం జైల్లోనే విచారణ జరుపుకోవాలని లేదా సీఐ ప్రాణాలకు ఎలాంటి హాని జరగదని పోలీసులు అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ మెమో ఫైల్ చేయడానికి 2 రోజుల గడువు కోరారు.
లాకప్ డెత్ అని తేల్చిన సిట్సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తూ కోర్టుకు సంచలన రిమాండ్ రిపోర్టు సమర్పించింది. విచారణ పేరుతో స్టేషన్‌లో సాయికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే మరణానికి కారణమని సిట్ తేల్చింది.
దీనిపై స్పందించిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఈ కేసు కేవలం సీఐ నాగరాజుకే పరిమితం కాలేదని, ఇందులో మరికొంతమంది పోలీసుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. స్టేషన్‌లో తన కుమారుడిపై ఇంకా చాలా మంది పోలీసులు దాడి చేశారని, ఆ రోజు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌తో సహా బాధ్యులందరినీ వెంటనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు తన బాధను పట్టించుకోకుండా కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ఉల్లంఘనపై సిట్ అధికారులు ఇప్పటికే సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు.
