Adopted Boy Approaches Guntur SP | గుంటూరు: తనను దత్తత తీసుకుని కొన్నేళ్ల పాటు పెంచిన తర్వాత శారీరకంగా, మానసికంగా వేధించి, చివరకు రోడ్డున పడేశారని ఆరోపిస్తూ ఒక బాలుడు న్యాయం కోసం గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వేధింపులు తట్టుకోలేక చదువు సైతం మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

Continues below advertisement

దత్తత తల్లిదండ్రుల వేధింపులు..

బాధిత బాలుడు గిరి నాగ సాయి సాకేత్ తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో అద్దేపల్లి సురేష్ బాబు, వెంకట మీనా దంపతులు గుడివాడ శ్రీదేవి, రమేష్ దంపతుల వద్ద నుంచి తనను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. అప్పటికే వారికి ఇద్దరు కుమార్తెలు ఉండటంతో, వారసుడిగా మగబిడ్డ కావాలనే ఉద్దేశంతోనే తనను దత్తత తీసుకున్నట్లు బాలుడు తన ఫిర్యాదులో తెలిపాడు. దత్తత తీసుకున్న కొంతకాలం పాటు బాగానే చూసుకున్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా తనపై తీవ్ర శారీరక, మానసిక వేధింపులు ప్రారంభించారని బాలుడు ఆరోపించాడు. 

Continues below advertisement

దుష్ప్రచారం చేస్తున్నారని చదువు ఆపేశాను..

తన గురించి సమాజంలో తప్పుడు ప్రచారం చేస్తూ తీవ్ర అవమానాలకు గురిచేశారని, ఈ వేధింపుల తట్టుకోలేక చదువును కూడా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చిందని బాలుడు వాపోయాడు. ప్రస్తుతం గుంటూరులోని గాంధీ పార్కు వద్ద క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయంపై గతంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్

ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా.. తమకు ఆర్థిక స్తోమత లేదని, పోషించలేమని చెప్పి వారు కూడా తిరిగి పంపించేశారని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక స్థోమత లేక కన్నవారూ కూడా కాదనడంతో.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించి, చట్ట ప్రకారం తనను పోషించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశాడు. పాపం బాలుడికి చిన్నతనంలోనే ఎన్ని కష్టాలో అని స్థానికులు అంటున్నారు.