Sai Krishna Missing Case:విజయవాడ నగరంలో సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అసలు సాయికృష్ణ ఏమయ్యాడు, పోలీసులు కస్టడీలో ఉండగానే ప్రాణాలు కోల్పోయడా? లేదా ఎవరైనా మాయం చేశారా? ఈ ప్రశ్నల చుట్టూ తిరుగుతున్న మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయమే కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి చేరుకున్న అధికారులు, కుటుంబసభ్యుల నుంచి సేకరించిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
ఒకవైపు కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ మధ్య ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి స్టేషన్‌లో జరిగిన పరిణామాల వరకు ప్రతి అంశాన్ని దర్యాప్తు బృందం భూతద్దంతో వెతుకుతోంది. ముఖ్యంగా పోలీసులపైనే ఆరోపణలు వస్తుండటంతో సాక్ష్యాల సేకరణలో అధికారులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు.
కుటుంబ సభ్యుల సంచలన స్టేట్మెంట్‌లు
శుక్రవారం ఉదయం ఏసీబీ దైవప్రసాద్ బృందం నేరుగా సాయికృష్ణ ఇంటికి వెళ్లింది. అక్కడ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మేనమామ నాగేశ్వరరావు, పిన్ని కనకదుర్గలను సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్మెంట్‌లు రికార్డ్ చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు విచరణాధికారులను సైతం విస్మయానికి గురి చేశాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్ లాకప్‌లో ఉంచారని, అక్కడ సీఐ నాగరాజు అతడిని అమానుషంగా చిత్ర వధ చేసి చంపేశారని వారు ఆరోపించారు.
హార్డ్‌డిస్క్‌లు, డీవీఆర్ పరికరాలు సీజ్
కుటుంబ సభ్యుల స్టేట్మెంట్‌ల అనంతరం దర్యాప్తు టీం కృష్ణ లంక స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ కేవలం మాటలతో కాకుండా డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా నిజానిజాలు తేల్చాలని నిర్ణయించింది. స్టేషన్ లోపల, బయట ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలు అత్యంత కీలకం కావడంతో అప్పటికప్పుడు ఫోరెన్సిక్ అండ్ సైబర్ అనాలసిస్ టీమ్ పిలపించారు. వీటిన్నింటినీ అధికారులు సీజ్ చేసి, విశ్లేషణ కోసం నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ రాత్రి స్టేషన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ డిజిటల్ ఆధారాలే ఇప్పుడు కీలకంకానున్నాయి.
మార్కాపురం టు విజయవాడ మధ్యలో ఏం జరిగింది?
సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ ఆపరేషన్‌లో ఎవరెవరు పాల్గొన్నవారు? అనే కోణంలో విచారణ సాగుతోంది. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారితోపాటు మరో ఎనిమిది మంది సిబ్బందిని శుక్రవారం దర్యాప్తు టీం విచారించింది. పెండింగ్‌లో ఉన్న NBW అమలు చేసేందుకే సాయికృష్ణ కోసం నలుగురు సిబ్బందిని మార్కాపురం పంపినట్టు ఏడీసీపీ వివరించినట్టు సమాచారం. అయితే అతడి తీసుకొచ్చిన తర్వాత ఎవరికి అప్పగించారు.?లాకప్‌లో ఉంచిన సమయం ఎంత? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు వారి స్టేట్మెంట్‌లు రికార్డు చేశారు.
రంగంలోకి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
కేసు తీవ్రతను దృష్ట్యా, ఈ అదృశ్యం వ్యవహారంపై విచారణాధికారిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ను నియమించారు. ఆయన శుక్రవారం విజయవాడకు చేరుకుని, తొలుత డీజీపీని కలిసి కేసు పురోగతిని వివరించారు. అనంతరం విజయవాడ సీపీ రాజశేఖరబాబును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరుగా కృష్ణలంక స్టేషన్‌కు వెళ్లిన ఎస్పీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతానికి దర్యాప్తు బృందం ఎనిమిది మంది కీలక సిబ్బందిని విచారిస్తోంది. ఇందులో టాస్క్‌ఫోర్స్, కృష్ణలంక స్థానిక పోలీసు సిబ్బంది ఉన్నారు.
