CM Chandrababu Naidu Meets Vijayalakshmi:  విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకుడు గాదె సాయి కృష్ణ అదృశ్యం , లాకప్ డెత్ ఆరోపణల ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రిని వేడుకున్నారు. 

Continues below advertisement

 సీఎంను కలిసిన బాధితుడి తల్లి – నిష్పక్షపాత విచారణకు హామీ 

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ గత నెల రోజులుగా అదృశ్యమవగా, అతని తల్లి విజయలక్ష్మి సీఎం చంద్రబాబు నాయుడును కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆమె సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులెంతటి వారైనా వదిలిపెట్టబోమని చంద్రబాబు గట్టి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్పందన పట్ల విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని మీడియాకు తెలిపారు.

Continues below advertisement

 అసలేం జరిగింది? – కస్టడీ డెత్ ఆరోపణలు 

పోలీసు రికార్డుల ప్రకారం గాదె సాయి కృష్ణపై   క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు  అతను ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఉంటున్నాడు. మే 9, 2026 న కృష్ణలంక పోలీసులు మార్కాపురం వెళ్లి సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాలేదు, పోలీసు స్టేషన్ లోనూ చూపించలేదు. అప్పటి కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్   జి. నాగరాజు ఆధ్వర్యంలో సాయి కృష్ణను స్టేషన్‌లో దారుణంగా కొట్టి చంపేసి, సాక్ష్యాలు దొరక్కుండా మృతదేహాన్ని తగలబెట్టేశారని తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు.

  సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశం 

పోలీసులు తమ కుమారుడిని కోర్టులో ప్రవేశపెట్టడం లేదంటూ విజయలక్ష్మి అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. జూన్ 29 లోగా సాయి కృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. మరోవైపు విజయవాడ స్థానిక కోర్టు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని మే 1 నుండి జూన్ 1 వరకు ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్క్‌లు, డీవీఆర్  లు ,  సర్వర్లను వెంటనే సీజ్ చేసి భద్రపరచాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.   

  సీఐపై మర్డర్  కేసు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేశారు. అలాగే ఈ కేసును నిష్పక్షపాతంగా తేల్చేందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, సీనియర్ ఐపీఎస్ అధికారి డి. నరసింహ కిషోర్‌ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సస్పెండైన సీఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత  కింద అక్రమ నిర్బంధం, హత్య , సాక్ష్యాల విధ్వంసం కింద హత్యానేరం కేసు నమోదు చేశారు.

 రాజకీయ రంగు పులుముకున్న ఉదంతం 

ఈ లాకప్ డెత్ ఆరోపణల ఉదంతం ఏపీలో రాజకీయంగానూ వేడి పుట్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసానికి వెళ్లి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం దారుణమని, కేవలం ఒక సీఐని సస్పెండ్ చేస్తే సరిపోదని, దీనిపై సీబీఐ ( విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ విచారణను వేగవంతం చేసింది.