ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ప్రజలపై ఇంకో భారం పడింది. డీజీల్ ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఆర్టీసీ(APSRTC) ఛార్జీలు కూడా పెంచుతున్నట్టు ఆర్టీసీ ఎండీ(APSRTC MD) వెల్లడించారు. డీజీల్ ధరల భారం నుంచి తట్టుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సెస్‌ పేరుతో వడ్డించక తప్పదంటున్నారు. 


ఇది ఛార్జీల పెంపు కాదన్నారు ఆర్టీసీ ఆర్టీసీ ఎండీ పల్లెవెలుగు(Palle Velugu)పై డీజిల్‌ సెస్‌ పేరుతో రెండు రూపాయలు వసూలు చేయనున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సులపై ఐదు రూపాయలు వసూలు చేయనున్నారు. ఈ రెండు బస్సులు కాకుండా ఇతర హై ఎండ్‌ బస్సులపై పది రూపాయల చొప్పున సెస్‌ విధించారు. 


పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర కొరత అధిగమించేందుకు కనీస ఛార్జ్‌ను పదిరూపాయలు చేశారు.  పెంచిన ఛార్జీలు రేపటి (గురువారం) నుంచి అమల్లోకి వస్తాయి. 






రోజు రోజుకు పెరిగిపోతున్న డీజిల్‌ ధరలు తట్టుకోవాలంటే సెస్‌ విధించక తప్పడం లేదన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు. అందుకే సెస్‌ పేరుతో భారం వేయకతప్పడం లేదన్నారు. అసలు ఇప్పుడున్న డీజిల్ రేటుతో పోలిస్తే ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెంచాల్సి ఉందన్నారు. కానీ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఛార్జీలు పెంచకుండా సెస్‌ పేరుతో భారం వేయాల్సి వస్తోందన్నారు. 


ఇప్పుడు పెంచిన ఛార్జీలు ఆర్టీసీకి పల్లీలతో సమానం అన్నారు ద్వారకా తిరుమల రావు. డీజిల్ సెస్ వల్ల ఏడాదికి రూ.720 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని దీని వల్ల పెద్ద సంస్థకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే టిక్కెట్లపై 32 శాతం మేర ఛార్జీలు పెంచాల్సి వస్తుందన్నారు. కోవిడ్ వల్ల గత రెండేళ్ల కాలంలో రూ. 5680 కోట్లు నష్టం వచ్చిందని వెల్లడించారు. 


ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేందుకే ఆర్టీసీ ఆస్తులు లీజ్‌కు ఇస్తామన్నారు ద్వారకా తిరుమల రావు. 
కేంద్రం డీజిల్ ధరలు పెంచినప్పుడల్లా ఆర్టీసీ ఛార్జీలు ఆటోమేటిక్‌గా పెరిగినట్టైతే అసలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారాయన.