టీడీపీలోని రెండు వర్గాల మధ్య కారణంగానే పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని అలవాల గ్రామంలో గొడవలు చెలరేగాయని తేల్చారు పోలీసులు. మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నాబాలకోటిరెడ్డిపై  జరిగిన హత్యాయత్నం జిల్లాలోనే సంచలనంగా మారింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన కుట్రగా టీడీపీ ఆరోపించింది. వైసీపీ కూడా టీడీపీని తప్పుపట్టింది. ఇలా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతున్న టైంలో పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు.  


రొంపిచెర్ల మండల టీడీపీ అద్యక్షుడు వెన్నా బాల కోటి రెడ్డి జరిగిన దాడి కేసులో డీఎస్పీ విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. అలవాల గ్రామంలోని టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెప్పారు. వారి మధ్య ఆధిపత్య పోరు కాస్త ఇలా దాడికి దారి తీసిందన్నారు. ఆధిపత్య పోరులో భాగంగానే బాల కోటిరెడ్డిపై దాడి జరిగిందని వివరించారు. గత పంచాయతీ ఎన్నికల నుంచి ఇద్దరు టీడీపీ నేతలు వెన్నా బాల కోటి రెడ్డి -వెంకటేశ్వరరెడ్డి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయని తెలిపారు.


ఎలాగైనా బాలకోటిరెడ్డిపై పైచేయి సాధించాలన్న కసితోనే వాకింగ్ ట్రాక్ వద్ద వెంకటేశ్వర రెడ్డి దాడి చేసినట్టు పోలీసులు వివరించారు. బాల కోటిరెడ్డి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు వెంకటేశ్వరరెడ్డిపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. నిందితుడు వెంకటేశ్వర రెడ్డిని అదుపులో తీసుకున్నారు. 


వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ... దాడికి ప్రధాన సూత్రధారైన పమ్మి వెంకటేశ్వరరెడ్డి తనంతట తానే స్వయంగా రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని తెలిపారు. దాడికి గురైన బాలకోటిరెడ్డి, దాడికి పాల్పడిన వెంకటేశ్వరరెడ్డి ఇద్దరు బంధువులేనన్నారు. టీడీపీలో వారి ఇరువురి మధ్య జరిగిన వర్గపోరే దాడికి కారణమని అభిప్రాయపడ్డారు.
ఇరువురి మధ్య వర్గపోరును 4 రోజుల నుంచి తీవ్రమైందన్నారు. అధిష్ఠానం కూడా అధిష్ఠానం కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా అది విఫలమైందని వివరించారు. 


పార్టీలో జరుగుతున్న పోరును ప్రభుత్వం దాడిగా చిత్రీకరించి కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ ప్రయత్నించిందని ఆరోపించారు శ్రీనివాస్‌రెడ్డి. కేసు దర్యాప్తులో ఉండగానే టీడీపీ లీడర్లు వైసీపీపై బురద జల్లే ప్రయత్నం మొదలుపెట్టారని మండిపడ్డారు. అసలు వాస్తవాలు తెలుసుకునే ఓపిక లేని చంద్రబాబు, లోకేశ్, అచ్చెం నాయుడు, జీవీ ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యాయత్నానికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రొంపిచర్ల ఎంపీపీ భర్తపై చేసే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.


ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరే జరిగి దాడికి కారణం అని తేల్చిచెప్పారు శ్రీనివాస్‌రెడ్డి. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు వాస్తవాలు తెలుసుకునే ఓపిక కూడా లేదని నిప్పులు చెరిగారు. ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ నాయకుల మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. గుడ్డ కాల్చి మొహానా వేస్తే వాళ్లే తుడుచుకుంటారనే ధోరణిలో టీడీపీ వారంతా ఉన్నారని అన్నారు. దాడి జరిగిన వెంటే వాస్తవాలు తెలుసుకునేందుకు గ్రామంలో అందరితో మాట్లాడామని వివరించారు. ఎవరిని అడిగిన వెంకటేశ్వర రెడ్డి పేరే చెబుతున్నారని వివరించారు.


ప్రశాతంగా ఉన్న గ్రామంలో గతంలో తిరునాళ్ల సమయంలో టీడీపీ వాళ్లే దాడిచేశారని, కానీ తాము ప్రతిదాడి చేయలేదన్నారు శ్రీనివాస్ రెడ్డి. దాడులను జగన్ కానీ వైసీపీ ప్రభుత్వం కాని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. నరసరావుపేటలో 20 ఏళ్లు హత్యా రాజకీయాలను పెంచి ప్రోత్సహించింది టీడీపీనే అని ఆరోపించారు. ఇప్పుడు గ్రామాల్లో అల్లర్లు సృష్టించి స్వార్థ రాజకీయాల కోసం రెచ్చగొట్టే  ధోరణిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాలు లేకుండా  మాట్లాడితే బాగోదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు.