ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దిగారు ఆయన పొలిటికల్ ప్రత్యర్థులు. సాధారణంగా షాప్ ఓపెనింగ్ లు లాంటి కార్యక్రమాల్లో ఆయన కనపడరు. కానీ ఆదివారం విజయవాడ సమీపంలోని ఒక సెలూన్ ఓపెనింగ్ కీ ఆయన వచ్చారు. పూర్తి డైనమిక్ లుక్ లో చాలా క్యాజువల్ డ్రెస్సింగ్ తో వచ్చిన ఆయన్ను చూసి ఫ్యాన్స్ ఆనందంతో ఊగిపోయారు.
చాలాకాలంగా పొలిటికల్ డ్రెస్సింగ్ లో తెల్లటి బట్టలు ధరించి మాత్రమే చూస్తున్న అభిమానులు 'OG' లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూసి 'సూపర్' అంటూ ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎలా ఒక సెలూన్ ఓపెనింగ్ కి వస్తారని కూడా ఎవరు ఊహించనిది. దానితో ఈ వార్త చాలా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది.
ట్రోల్ చేస్తున్న పొలిటికల్ ప్రత్యర్థులు
అయితే ఆయన రాజకీయ ప్రత్యర్థులు, వైసీపీ అభిమానులుగా చెప్పుకునే కొంతమంది సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో చేసుకున్న ఎంవోయూలు, ఆ తర్వాత కొన్నిచోట్ల జరిగిన నూడిల్స్ బండి ఓపెనింగ్ లాంటి కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. అప్పట్లో దీని వెనుక ఉంది టిడిపి జనసేనలకు చెందిన సోషల్ మీడియా అభిమానులని వైసిపి గుర్రు గా ఉంది.
నిజంగానే అప్పట్లో ఆ విషయాలు చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాయి కూడా. ప్రస్తుతం అధికారం లోకి వచ్చిన కూటమి నేతలు కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి మరీ సెటైర్స్ వేశారు. ఇప్పుడు అదే యాంగిల్ లో వైసీపీ సోషల్ మీడియా అభిమానులు "మమ్మల్ని ట్రోల్ చేశారు మరి మీరు సెలూన్ ఓపెనింగ్ లు చేయడం ఏమిటి "అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. " అధికారంలోకి వస్తే మీరు చేస్తామన్న అభివృద్ధి ఇదేనా " అంటూ వ్యంగంగా పవన్ కళ్యాణ్ సెలూన్ ఓపెనింగ్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
ధీటుగా స్పందిస్తున్న జన సైనికులు, పవన్ ఫ్యాన్స్
ఈ విమర్శలకు అంతే దీటుగా జవాబిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్." మొదటినుంచి తన వెంట నడిచిన అభిమాని ఒక సెలూన్ పెట్టుకుంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి భేషజం లేకుండా వచ్చి దాన్ని ప్రారంభించడం కంటే గొప్ప విషయం ఏముంటుందని " వారు బదులిస్తున్నారు. దానితో కౌంటర్, రివర్స్ కౌంటర్ పోస్టులతో సోషల్ మీడియా హీటెక్కింది.
వింటేజ్ లుక్ లో పవర్ స్టార్
మరోవైపు చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ను ఇలా ట్రెండీ లుక్ లో చూసి ఆయన ఫ్యాన్స్, యూత్ సంబరపడుతున్నారు. తమ "పవర్ స్టార్" ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయారంటూ ఆయన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు 'హరిహర వీరమల్లు ', 'OG ' రిలీజ్ కానున్నాయి.