Viral News: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. రెంటపాళ్లలో మృతి చెందిన నేత ఫ్యామిలీని పరామర్శించారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లి వద్ద బయల్దేరినప్పటి నుంచి పర్యటన పూర్తి అయ్యే వరకు వైసీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ రోడ్లపై హంగామా చేశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులను బెదిరిస్తూ చూపించిన పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ కూడా వాటిని ప్రస్తావిస్తూ యథా అధినేత తథా నాయకులు అని కామెంట్స్ చేశారు. 

రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఫలితాలు వచ్చినప్పటి నుంచే టీడీపీ నేతల పని పడతామని కార్యకర్తలు పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడ్నీ అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. 

మరో కార్యకర్త వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి తండ్రి రాజా రెడ్డి ఫోటో చూపిస్తూ పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలు అవుతుందని వార్నింగ్ ఇచ్చిన ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరికొందరు కార్యకర్తలు ఎవరైనా రాని తొక్కిపడేస్తామనే ఫ్లెక్సీలు పెద్దగా తయారు చేసి సోషల్ మీడియాల్లో పోస్టులు చేస్తున్నారు. 

జగన్ మోహన్ రెడ్డి వార్ డిక్లేర్ చేశాడని అంతు చూస్తాడనే అర్థం వచ్చేలా మరో కార్యకర్తల పెద్దగా ఫ్లెక్సీని ప్రదర్శించడం కూడా వైరల్ అవుతోంది. 

దీనిపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు పెట్టి ఏమన్నారంటే..."యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసిపి పద్ధతి మారలేదు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజా పాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించం." అని వార్నింగ్ ఇచ్చారు.

ఉన్మాదులను తయారు చేస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రజల భద్రతకు ముప్పని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. "ఉన్మాదం, అరాచకం, రౌడీయిజం మీ నాయకుడి, మీ నైజం.....ప్రజా సంక్షేమం, ప్రజల భద్రత, దుర్మార్గులను ఎక్కడపెట్టాలో అక్కడ పెట్టడం చంద్రబాబుగారి నైజం....ప్రజలను ఇబ్బందిపెట్టే ఏ అరాచక శక్తినీ వదిలే ప్రసక్తే లేదు...." అని వార్నింగ్ ఇచ్చారు.