వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అంతకంటే ముందు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్... కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని, కేవలం నియంత్రణలు, అన్యాయాలు మాత్రమే జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా ఉన్న పోలీసులను నియమించారని, కూటమి విజయం కోసం అన్యాయాలు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున టీడీపీ, జనసేన నేతల ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అవమానించారని విమర్శించారు.
టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి జరిగిందని జగన్ ఆరోపించారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని బెదిరించారని అన్నారు. పోలీస్‌లు కూడా రౌడీషీట్ తెరుస్తామని బెదిరించారని అన్నారు. అనవసరమైన ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. జూన్ 5న పోలీసులు నాగమల్లేశ్వరరావును విడుదల చేసిన తర్వాత ఆయన గుంటూరులోని సోదరుడి ఇంటికి వెళ్లి బెదిరింపులు గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.
ఈ వేధింపులు ఎక్కువ కావడంతో నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడని అన్నారు. తండ్రి వెంకటేశ్వర్లు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారని జగన్ వివరించారు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి భార్య, కూతురు ఇంకా తీవ్ర దుఃఖంలో ఉన్నారని, చంద్రబాబు ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు జగన్. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని, వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తను కూడా పోలీసులు వేధించారని, ఆయన ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారులు కుల ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్సీపీలోని కమ్మ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. స్థానిక డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాదంతో వ్యవహరించి, వైఎస్సార్సీపీ కార్యకర్త లక్ష్మీనారాయణను కమ్మ కులంలో ఎందుకు పుట్టావని అవమానించారన్నారు. ఈ అవమానం భరించలేక లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని అ్నారు. ప్రస్తుతం ఆయన చావు-బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని చెప్పుకొచ్చారు.
“చంద్రబాబు, మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా? మా పార్టీలో కమ్మవారు ఉంటే నీకేంటి అభ్యంతరం?” అని జగన్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలోని కమ్మ నేతలను చంద్రబాబు టార్గెట్ చేసి వేధిస్తున్నారని, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, తలశిల రఘురాం, అబ్బయ్య చౌదరి, దగ్గుబాటి సురేష్, నంబూరు శంకరరావు, కృష్ణవేణి, ఇంటూరి రవి, రాజ్‌కుమార్, బ్రహ్మనాయుడు, పోసాని కృష్ణ మురళి వంటి నేతలపై కేసులు పెట్టి వివిధ రకాలుగా వేధిస్తున్నారని విమర్శించారు.
“ఏం పాపం చేశాడని ఈ నేతలను వేధిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కుట్రలో ఎల్లో మీడియా కూడా భాగమైందన్నారు. పోలీసులు, చంద్రబాబు పాపంలో భాగం కావద్దని హెచ్చరించారు. ఈ పాలన ఎల్లకాలం ఉండదని, మరో మూడు-నాలుగేళ్లలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమే” అని హెచ్చరించారు.