ప్లాస్టిక్ నిషేదాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుంచే ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టింది.  ప్రజలకు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వినియోగంపై చైతన్యవంతులను చేయటానికి కార్యచరణ రూపొందించినట్టు నగర మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఆవరణలో మేయర్  రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులు, సిబ్బందితో కలసి ప్లాస్టిక్ నిర్మూలన ప్రతిజ్ఞ చేపట్టారు.                                                                                                                     


నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జాతీయ స్థాయి స్వచ్చ్ సర్వేక్షణ్‌లో విజయవాడ మూడో స్థానంలో ఉండటం ఎంతో గర్వకారణమని అన్నారు. రాబోయే రోజులలో ఇదే స్పూర్తితో మొదటి స్థానం సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన ఆవశ్యకత అందరిపై ఉందని అన్నారు. అధికారులు, సిబ్బంది కృషి, ప్రజల సహకారంతోనే ర్యాంక్ సాధించామన్నారు. ఇటివల కార్పొరేటర్ల విజ్ఞాన యాత్రలో ఇతర నగరాలు కూడా అభినందనలు తెలియజేశాయని వివరించారు.


కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్త్పతులను నిషేధించాలని అన్నారు.జాతీయ స్థాయిలో స్వచ్చ్ సర్వేక్షణ్‌లో వచ్చిన మూడో స్థానాన్ని నిలబెట్టుకొని మొదటి లేదా రెండో స్థానం కైవసం కోసం ప్రయత్నించాలన్నారు. దీని కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నారు. దానికి బదులుగా జ్యూట్, క్లాత్ సంచుల వాడకం పెంచాలన్నారు. మన ఇంటి, నగర పరిసరాలు అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకుంటూ నగరలో పర్యావరణాన్ని కాపాడటానికి కృషి చేయాలన్నారు. దీని ద్వారా ప్రజల‌లో కూడా చైత్యనం వస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ రహిత గణేష్ ఉత్సవాలు నిర్వహించుకొనేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.                                                                   


నగరపాలక సంస్థ  ప్రధాన కార్యాలయముతోపాటుగా మూడు సర్కిల్ కార్యాలయాల‌్లో, సచివాలయాల‌్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, అందరు సిబ్బంది వారి వారి కార్యాలయాలలో ప్రతిజ్ఞ నిర్వహించారు. కళాజాతర బృందం ద్వారా ప్లాస్టిక్ వాడకంతో కలిగే ఇబ్బందులు, పరిసరాల శుభ్రత తదితర అంశాలపై నృత్యగేయాలతో  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని, వాటి స్థానంలో వినియోగించాల్సిన ఉత్త్పతులను ప్రదర్శన ఏర్పాటు చేశారు.