మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ప్రకృతి విపత్తు విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని... అక్కడ చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది.
జులై 8న ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారని... సంబంధిత అధికారులతో మాట్లాడారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు చిక్కుకొని ఉంటే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని కూడా చెప్పారని తెలిపింది.
ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే రెండు హెల్‌లైన్లు యాక్టివేట్ చేశామని పేర్కంది ఏపీ ప్రభుత్వం. అమరావతి సచివాలయంలో 1902 నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. అదే టైంలో 011-23384016 నెంబర్‌తో దిల్లీలోని ఆంధ్రాభవన్‌లో మరో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని పేర్కొంది.
అక్కడితో ఆగిపోకుండా.. ఐఏఎస్ ఆఫీసర్ హిమాన్షుశుక్లను శ్రీనగర్ పంపినట్టు పేర్కొంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన యాత్రికులను గుర్తించి.. వారిని సురక్షితంగా స్వస్థలాలకు పంపేలా అక్కడ స్థానిక అధికారులతో మాట్లాడారని తెలిపింది.
ఇవాళ(సోమవారం) సాయంత్రం ఆరు గంటల వరకు 26 ఫోన్ కాల్స్‌ను అమర్‌నాథ్ యాత్ర హెల్ప్‌లైన్స్‌కు వచ్చాయని వివరించింది ప్రభుత్వం. దీంతోపాటు ఏపీ అధికారులు కశ్మీర్ అధికారులతో మాట్లాడి చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాళ్లను స్వస్థలాలకు పంపించినట్టు పేర్కొంది.
ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగానే మూడు పెద్ద యాత్రిక బృందాలను గుర్తించినట్టు తెలిపింది ప్రభుత్వం. అందులో ఒకటి తాడేపల్లిగూడెం వాళ్లదని. ఆ బృందంలో 20 మంది ఉన్నట్టు పేర్కొంది. మరో రెండు గ్రూప్‌లు నెల్లూరుకు చెందినవిగా తెలిపింది. వీరితోపాటు మరో 23 మంది వ్యక్తులను కూడా గుర్తించినట్టు వెల్లడించింది.
ఈ సహాయక కార్యక్రమం మరో 72 గంటలపాటు కొనసాగిస్తామని ఇంకా ఎవరైనా అక్కడ చిక్కుకొని ఉంటే సురక్షితంగా తీసుకొస్తామంది ప్రభుత్వం. రాజమండ్రికి చెందిన కొత్త పార్వతి ఆచూకి లభ్యం కాలేదని తెలిసిందని... ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి తప్పిపోయిన 37 మంది ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయాలని కేంద్ర హోం సెక్రటరీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాదం జరిగి మూడు రోజులైనా తమ వారి ఆచూకి తెలియక బాధితుల కుటుంబం ఆందోళన ఉందన్నారు. వారికి నీరు, ఆహారం, మందులు అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. వీళ్లను సురక్షితంగా స్వస్థలాలకు చేరేలే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా బాధిత ఫ్యామిలీకి చేరవేయాలని సూచించారు.