CM Jagan Review : గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జ‌గనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాలతో ఇంకా అవసరమైన చోట ల్యాండ్‌ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆప్షన్‌-3(ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి లబ్దిదారుడికి అందజేస్తుంది)లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్న విష‌యాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. ఆప్షన్‌-3 ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని తర్వాత పూర్తిచేయడానికి నిర్దేశించుకున్న ఎస్‌ఓపీని పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉన్నాయా?లేదా?  ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా? లేదా? ఇవన్నీ ఉండేలా చూసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 


నిర్మాణ నాణ్యతపై దృష్టిపెట్టండి


ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.  ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధం కావాలన్నారు. జగనన్న కాలనీల్లో డ్రెయిన్స్ సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డ్రైనేజి, కరెంటు, నీటి సరఫరా అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్లు నాణ్యతతో ఉండాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టంచేశారు. జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాలిటీ లే అవుట్ లుగా తయారవుతున్నాయని తెలిపారు. ఇలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. నిర్మాణ నాణ్యతపై అధికారులు ప్రతి దశలోనూ దృష్టిపెట్టాలని సూచించారు. 


పట్టాల పంపిణీపై 


90 రోజుల్లో పట్టాలు పంపిణీపై సీఎం జగన్ సమీక్షించారు. లబ్ధిదారునికి ఎక్కడ ఇంటి స్థలం ఇచ్చారో చూపడమే కాకుండా, పట్టా, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇవ్వాలన్నారు. పట్టా, డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారుల నుంచి ధృవీకరణ తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఇంటి నిర్మాణం త‌రువాత అవ‌స‌రమైన ఇంటీరియర్ ప‌నులపై కూడా సీఎం ప్రత్యేకంగా అధికారుల నుంచి వివరాలు ఆరా తీశారు. సామాన్యుడి సొంత ఇంటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు జరుగుతున్న ప్రయ‌త్నంలో అధికారులు చిత్తశుద్ధితో భాగ‌స్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, అధికారులు పాల్గొన్నారు.