Andhra Pradesh: ఏపీ ఎన్నికల సీజన్ లో మద్యం పాలసీ(Liquor Policy) మార్పు అనేది అత్యంత కీలకంగా మారింది. వైసీపీ హయాంలో మద్యం ధరలు విపరీతంగా పెంచి నాసిరకం సరకు అంటగట్టారని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. కూటమి అధికారంలోకి రాగానే నూతన మద్యం విధానంతో నాణ్యమైన మద్యాన్ని తక్కువరేటుకే అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు(Chandrababu). 100 రోజుల పాలన తర్వాత ఇప్పుడు నూతన మద్యం పాలసీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కాలపరిమితితో కొత్త లిక్కర్ పాలసీని ఖరారు చేసింది. దీనికి సంబంధించి కొత్త షాపులకోసం తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం అర్థరాత్రి ఈ నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు(మంగళవారం)నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశమిచ్చారు. 


నోటిఫికేషన్ వివరాలు ఇవే


కొత్త విధానం అమలు కాలం 2024 అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు
మొత్తం షాపులు 3396
దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 9
లాటరీ ద్వారా లైసెన్స్ లు ఖరారు : అక్టోబర్ 11
లైసెన్స్ దారులు షాపులు ప్రారంభించే తేదీ అక్టోబర్ 12
షాపులకు లైసెన్స్ రుసుము రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు
4 శ్లాబుల్లో లైసెన్స్ రుసుము ఖరారు
10వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50లక్షలు
5 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85లక్షలు
రెండో ఏడాది 10శాతం మేర లైసెన్స్ రుసుము పెంపు
ఆరు విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించే వెసులుబాటు


ఆన్‌ లైన్‌ లేదా ఆఫ్‌ లైన్‌ విధానంలోనూ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకునే అవకాశముంది. ఒక్కో షాపు లైసెన్స్ కోసం రూ.2 లక్షలు నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 9 వరకు ఈ దరఖాస్తులు స్వీకరించి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీస్తారు. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు పూర్తి చేస్తారు. 


ప్రస్తుతం ఏపీ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APSBCL) ఆధ్వర్యంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తోంది. అక్టోబర్ 12 నుంచి ఇవి ప్రైవేట్ పరం అవుతాయి. అప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు జరుగుతాయి. ఇక ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల సంగతి తేలాల్సి ఉంది. వాలంటీర్ల లాగా వారిని కూడా పక్కనపెడతారా, లేక ప్రత్యామ్నాయం చూపిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇది వరకే వారు తమ ఉద్యోగాల కోసం నిరసనలు చేపట్టారు. ఇప్పుడు కొత్త షాపులకోసం లైసెన్స్ ప్రక్రియ కూడా మొదలైంది కాబట్టి తమ సంగతేంటో తేల్చాలని వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశముంది. 


ప్రీమియం స్టోర్ల కొనసాగింపు.. 
వైసీపీ హయాంలో లిక్కర్ షాపులతోపాటు ఎలైట్ వైన్స్ పేరుతో కొన్ని ప్రీమియం స్టోర్లు కూడా ఏర్పాటు చేశారు. కొత్త విధానంలో కూడా వాటిని కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 12 చోట్ల ప్రీమియం స్టోర్లు ఉంటాయి. వీటికోసం ప్రత్యేకంగా విధి విధానాలు ఖరారు చేశారు. ప్రీమియం స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఏడాదికి కోటి రూపాయలు లైసెన్సు రుసుము తీసుకుంటారు. 


నూతన మద్యం విధానంలో మద్యం రేట్లు భారీగా తగ్గుతాయనే అంచనాలున్నాయి. వైసీపీ హయాంలో మద్యం తయారైన తర్వాత 10 రకాల పన్నులు విధించగా.. కొత్త విధానంలో వాటిని 6కు తగ్గించారు. అదనంగా డ్రగ్ కంట్రోల్ సెస్ అనేది విధించారు. ఈ సెస్ ద్వారా సమకూరే మొత్తాన్ని యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కోసం వినియోగిస్తారని తెలుస్తోంది. కొంత మొత్తాన్ని మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలకోసం కేటాయిస్తారు.


Also Read: లడ్డూ కల్తీ జరిగిందనడానికి ఆధారాలేవి ? శ్రీవారి ప్రసాదం వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు