Manipal Hospitals Conference On Infectious Diseases: మణిపాల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పల్మనాలజీ, రుమటాలజీ, అంటువ్యాధులపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రముఖ వైద్యులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. వైద్య రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో పల్మనాలజీ, రుమటాలజీ, అంటువ్యాధులు చాలా ముఖ్యమైనవని అన్నారు. వీటికి చికిత్స, వైద్య విధానంలో వచ్చిన మార్పులతో ఈ వ్యాధుల బారిన పడ్డ రోగుల జీవితాలు మెరుగయ్యాయి. ఊపిరితిత్తుల వ్యాధుల్లో ముఖ్యంగా కొవిడ్ - 19 అనంతరం తలెత్తిన సమస్యలపై మణిపాల్ ఆస్పత్రి విజయవాడ నోవాటెల్‌లో 'లంగ్ మ్యాట్రిక్స్' సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆయనకు డా. సుధాకర్ కంటిపూడి (క్లస్టర్ హెడ్, మణిపాల్ హాస్పిటల్స్) స్వాగతం పలికారు. డాక్టర్ లోకేశ్ గుత్త (కన్సల్టెంట్ ఎంటర్‌వెన్షనల్ పల్మనాలజిస్ట్), డా జి.ఉదయ్‌కిరణ్ (కన్సల్టెంట్ పల్మనరీ మెడిసిన్) వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.


ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన 400 మంది వైద్యులు పాల్గొన్నారు. పల్మనాలజీ, రుమటాలజీ, అంటువ్యాధులు రంగాల్లో పరిశోధన, విద్య, సంరక్షణ మొదలగు వాటిపై ప్రముఖ వైద్యులతో ప్రసంగాలు, వర్క్ షాప్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాను ప్రవీణ్ నాయుడు - కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, డా.నేహామిష్ర - కన్సల్టెంట్ ఇన్‌ఫెక్షియస్ డిసీజస్, డా.పవన్ కుమార్ రెడ్డి - కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ మెడిసిన్, డా.కావ్యదేవి - కన్సల్టెంట్ రొమటాలజిస్ట్ తదితర వైద్యులు వివిధ టాపిక్స్‌పై ప్రసంగించారు.