ఎన్టీఆర్ జిల్లా నందిగామలో స్థానిక ఎమ్మెల్యేపై ఓ కుటుంబంలో నెలకొన్న వ్యతిరేకత తీవ్రమైన ఉద్రిక్తతకు దారి తీసింది. గడపగడపకు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ ఘటన జరిగింది. మా ఇంటికి రావద్దు ఎమ్మెల్యే గారు అంటూ గ్రామస్థులు కొందరు తెగేసి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.


గడపగడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావును స్థానికులు నిలదీశారు. తమకు ఇళ్లు లేవు, కరెంట్ స్తంభాలు లేవు అని నిలదీశారు. అది గొడవకు దారి తీయడంతో ఎమ్మెల్యే సిబ్బందితో గ్రామస్థులు బాహాబాహీకి దిగారు. ఓట్లు అడగడానికి మళ్లీ వస్తారా మా దగ్గరికి అప్పుడు చెబుతాం మేం అని గ్రామస్థులు తేల్చి చెప్పారు. తమ ఇంటికి రావొద్దని పరిటాల గ్రామ ప్రజలు బహిరంగంగానే తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో లబ్ధిదారులైన తమకు ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటీర్ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వాపోయారు.


పార్టీకి అనుకూలంగా ఉంటేనే వాలంటీరు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను నిలదీసి వార్డు ప్రజలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.