YSRCP: విజయవాడలో వరద ముప్పు ఇంకా పోలేదు. వరద నీటిలో జనాలు మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం రాత్రీపగలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లోనే బురదపై రాజకీయాలు కూడా అంతకు మించి అన్నట్టు సాగుతున్నాయి. మొన్నటి వరకు రిటైనింగ్ వాల్ మేం కట్టామంటే మేం కట్టామంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఫేక్ ఫొటోలతో సోషల్ మిడియాలో వార్ నడుస్తోంది. 


వైసీపీకి మద్దతు తెలిపే వారంతా విజయవాడ వరదలకు చంద్రబాబు మాత్రమే కారణమని... సహాయక చర్యలు అసలు బాగాలేవని ఎవరికి వాళ్లు ఎక్కడెక్కడి వీడియోలను పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందనే కలరింగ్ ఇస్తున్నారు. దానికి కౌంటర్‌గా చేస్తున్న సాయం, పాజిటివ్ యాంగిల్‌లో టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఈ వార్‌లోకి ఫేక్‌ ఫొటోలు రావడంతో టీడీపీకి ఛాన్స్ దొరికినట్టైంది. 


వైసీపీకి చెందిన ఓ సపోర్టర్‌ ఓ ఫోటో పెట్టి వరదలు తగ్గిన తర్వాత బుడమేరు ముంపుపై చర్చ జరపాలని అన్నాడు. కరకట్ట కోసం గేట్లు ఎత్తారని అంటున్నట్టు ఆరోపించాడు. అదే జరిగి ఉంటే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని కామెంట్ పెట్టాడు. అయితే అతను పెట్టిన ఫొటో బంగ్లాదేశ్ వరదల సమయంలో తీసింది. కావడంతో టీడీపీ కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. 






నేరుగా మంత్రి నారా లోకేష్ ఆ ఫొటోను, ఆ వ్యక్తి ట్వీట్‌ను సోషల్ మీడియా పోస్టు చేస్తూ ఇలా కామెంట్ పెట్టారు. "వరదల్లో చిక్కుకొని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే... ప్రభుత్వం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే...సైకో జగన్ వికృతానందం చూడండి.. బంగ్లాదేశ్ వరదల ఫోటో తీసుకొచ్చి విజయవాడ వరదలు అంటూ ఫేక్ చేసి.. జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జగన్, వైసీపీ కిరాయి మూకలని సైకోలు అనడంలో తప్పేముంది?" అని ప్రశ్నించారు. 


ఇలాంటి వ్యక్తులను విపత్తుల టైంలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని జైల్లో పెట్టాలని కొందరు సలహా ఇస్తున్నారు. ఉపేక్షించినన్నిరోజులు వీళ్లు ఇలానే చేస్తుంటారని సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు.