NTR Bharosa :  ఏపీలో మొత్తం 65,18,496 మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు.  జులై ఒకటో తేదీనే 90 శాతం లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే.  ఏపీ సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఈ మేరకు  అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోని తన క్యాంపు ఆఫీసు నుంచి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. 


ఆమెకే తొలి పెన్షన్
మచిలీపట్నం ఫత్తుల్లాబాద్‌ కు చెందిన సీమా ఫర్వీన్ (21) అనే దివ్యాంగురాలు సోమవారం (జులై 1న) ఏపీలో తొలి పెన్షన్ అందుకోనుంది. 100శాతం వైకల్యంతో మంచానికే పరిమితమైన సీమా ఫర్వీన్ కి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిబంధనల పేరుతో ప్రతి నెల వస్తున్న పెన్షన్ ను నిలిపేసింది. దీనిపై ఎన్నికల ప్రచారంలో భాగంగా  మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫర్వీన్ కు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఫర్వీన్ కు రూ.15వేల పెన్షన్ ను మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా అందజేయనున్నారు.  






చంద్రబాబు అప్పుడే చెప్పారు
మచిలీపట్నంకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్  ఇంట్లో 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడుతున్నారని వైకల్యంతో బాధపడుతున్న తన పెన్షన్ తొలగింపును చంద్రబాబు ప్రశ్నించారు. ఆనాడు బందరులో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో వేదిక పైకి పర్వీన్‌ను కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు.  ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. 18సంవత్సరాల వయసు వచ్చినా వైకల్యం కారణంగా తల్లిదండ్రులు చేతులపైనే పెరుగుతున్న ఆడబిడ్డ పెన్షన్ తొలగిస్తారా అంటూ అప్పుడు మండిపడ్డారు. ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే ప్రభుత్వ సంక్షేమమా అని నిలదీశారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో   సోమవారం ఫర్వీన్ కు రూ.15వేల పెన్షన్ ను పంపిణీ చేయనున్నారు. 


ఒకటో తేదీనే పింఛన్
 రాష్ట్రంలో మొత్తం పింఛను లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.4,399.89 కోట్ల నిధులను విడుదల చేసింది. వీరిలో 90 శాతం మందికి ఒకటో తేదీనే పింఛను డబ్బులు అందించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు.  ఒకటో తేదీ రోజు పింఛను అందని వారికి 2వ తేదీన కచ్చితంగా అందజేయాలని స్పష్టం చేశారు.  సోమవారం పింఛన్ల పంపిణీని స్వయంగా సీఎం చంద్రబాబు  ప్రారంభించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. సీఎం ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం ఇదే మొదటిసారి.  


పెరిగిన పెన్షన్లు
ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పింఛన్లను రూ. 3,000 నుంచి రూ. 4,000 కు పెంచుతామని టీడీపీ హామీ ఇవ్వడం తెలిసిందే.  అలాగే దివ్యాంగులకు రూ. 3,000 నుంచి రూ. 6,000కు పెంచుతామని చెప్పింది.  అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. పింఛన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.  పెంచిన పింఛన్లను ఏప్రిల్ నుంచే ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. దీంతో జూలై 1వ తేదీన వృద్ధులు, వితంతవులకు రూ. 4 వేల పింఛనుకు అదనంగా, ఏప్రిల్, మే, జూన్ నెలలకు గానూ రూ. 1,000 చొప్పన మొత్తం రూ. 7,000  లభించనుంది. దివ్యాంగులకు పెరిగిన పింఛన్ రూ. 6,000 అందజేయనున్నారు.