మొన్న కారుపై గోధుమ బస్తా... నిన్న తనపై దాడికి టీడీపీ నేతలు ప్రయత్నించారని మంత్రి అంబటి రాయుడు ఆరోపించారు. ఖమ్మంలోని ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తే దాడికి యత్నించారని చెప్పారు. ఖమ్మంలో తనకు నిరసన సెగ అంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి సీరియస్ అయ్యారు.


మంత్రి తాడేపల్లిలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ... " ఓ నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్తే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఖమ్మంలో ఒకేసారి హఠాత్తుగా పదిమంది వచ్చి వేసేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారు. ఇలాంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న నాపైనే దాడి చేయాలని యత్నించారు" అని అంబటి వెల్లడించారు.


నన్ను చంపితే 50 లక్షలు


గతంలో కార్తీక వనభోజనాల సమయంలో నన్ను చంపేసిన వారికి 50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈరోజు దాడికి యత్నించిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లిన వారిపై కూడా దాడి చేస్తారా? ఇలాంటి వారితోనే వంగవీటి రంగాని హతమార్చారు. ముద్రగడ పద్మనాభం మీద కూడా దాడి చేశారు. ఇది ఏమాత్రం సహించరానిది. చంద్రబాబు మీద ప్రేమ ఉంటే అది వేరేలా వ్యక్తం చేసుకోండి. అంతేకానీ దాడులు చేస్తామంటే మేము చేతులు కట్టుకొని కూర్చోము అని హెచ్చరించారు.


దాడులపై విచారణ జరగాలి


డబ్బు మదంతో కొందరు ఉన్మాదులు చిలరేగిపోతున్నారని అంబటి వెల్లడించారు. వీరికి తోడుగా కొన్ని చానళ్లు అంబటికి నిరసన సెగా అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. దాడులు చేస్తే చేతులు కట్టుకొని కూర్చోమని, ఉన్మాదులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తన కారుపై గోధుమ బస్తాలు పడటం, దాడికి ఎత్తించడంపై విచారణ జరగాలని వెల్లడించారు.


టీడీపీ నేతలకు దమ్ముంటే అలా చేయండి


టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పిటిషన్లు వేసిన న్యాయస్థానాల నిబంధనల మేరకు నడుచుకుంటాం. ఆయన కదలికలను పసికట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. అజ్ఞాత వ్యక్తి లేఖ రాశాడని చంద్రబాబు చెప్తున్నారు. ఆ లేఖ ఏంటో? రాసినది ఎవరో ? పోలీసుల విచారణలో తేలుతుంది. పెండ్యాల శ్రీనివాస్ ని చంద్రబాబు దేశం దాటించారు. ఆయన్ని పిలిపించి సిఐడికి అప్పగిస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేసే పరిస్థితి లేదు. ఇక తెలంగాణ టీడీపీ అడ్డా అని ఎలా అంటారు? చంద్రబాబు తప్పుచేసి జైలుకు వెళ్లారు. మీకు దమ్ముంటే రాజమండ్రి జైలు గోడలు పగలగొట్టండి. దాడికి యత్నించిన ఎనిమిది మంది ఒకే కులం వారు. వారికి కాదు నాకు కులం ఉందని గుర్తుపెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఖమ్మంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి ఇవాళ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబు తో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత కేతినేని హరిష్ తో పాటు పలువురుపై పోలీసులు కేసు నమోదు చేశారు.