Janasena Party Office: జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ చేప‌ట్టనున్న ఎన్నికల ప్రచారం కోసం కొత్త కాన్వాయ్ సిద్ధమైంది. అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌య‌ద‌శ‌మి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేప‌ట్టనున్నారు. ఈ మేర‌కు పార్టీ అధిష్ఠానం రూట్ మ్యాప్ సిద్ధం చేసే ప‌నిలో నిమ‌గ్నమైంది. కాగా, కాన్వాయ్ కోసం కొత్తగా కొనుగోలు చేసిన‌ వాహ‌నాలు పార్టీ రాష్ట్ర కార్యాల‌యానికి చేరుకున్నాయి. మొత్తం 8 నలుపు రంగులో మహీంద్రా స్కార్పియో వాహనాలను కొనుగోలు చేశారు. పవన్ పర్యటనకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వీటికి పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.


అక్టోబరు 5 నుంచి పర్యటన
పవన్‌ కల్యాణ్‌ అక్టోబరు 5న దసరా రోజు నుంచి పవన్ యాత్ర మొదలుకానుంది. తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. దసరా నుంచి రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటన ఉండనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 


ఈ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్ పర్యటన ఉండేలా పార్టీ కీలక నేతలు రూట్‌ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్నారు.