మహారాష్ట్రలో ఏక్‌ నాథ్‌ షిండే శివసేనని దెబ్బతీసినట్లు ఏపీలో కూడా ఓ రాజకీయపార్టీ బీజేపీకి టార్గెట్‌గా మారిందా ? వచ్చే ఎన్నికల్లో కాకపోయినా 2029 ఎన్నికల నాటికి ఆ పార్టీ మొత్తం కాషాయంలో కలిసిపోవడం ఖాయమేనా ? ఇప్పుడిదే ఆంధ్రా రాజకీయాల్లో హాట్‌ న్యూస్‌. కేశినేని నాని చేసిన కామెంట్స్‌తో దీనిపై తీవ్రమైన డిస్కషన్ నడుస్తోంది. 


టిడిపిలో అన్నదమ్ములుగా జేసీ బ్రదర్స్‌, కేశినేని బ్రదర్స్‌కి పేరుంది. వీళ్లు రాజకీయాలతోనే కాదు ట్రావెల్స్‌ వ్యాపారంతోనూ తెలుగురాష్ట్రాల ప్రజలకే కాదు సౌత్ జనాలకు బాగా తెలుసు. అలాంటి కేశినేని ఇంట రచ్చ మొదలైంది. ఆ కుటుంబ వ్యవహారాలకు రాజకీయాలు అంటుకున్నాయి. నిన్నటి వరకు ఒక్కటిగా ఉన్న అన్నదమ్ములు ఇప్పుడు ఎవరికి వారే అయ్యారు.


కృష్ణాజిల్లాలో కేశినేని బ్రదర్స్‌ అంటే తెలియని వాళ్లు ఉండరు. మొన్నటి వరకు కేశినేని నానితోనే ఎక్కువగా క్యాడర్‌ ఉండేది. అలాగే అధినేత దగ్గర కూడా నానికి మంచి గుర్తింపే ఉండేది. ఎంపీగా కన్నా తన మాటలతోనే ఎక్కువగా కాంట్రవర్సీ అయిన నాని... కొన్ని రోజులుగా టీడీపీని టార్గెట్ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ గతంలో షాక్ ఇచ్చిన ఆయన... ఇప్పుడు టీడీపీని ఇరుకున పెట్టే లీకులు ఇస్తున్నారు. 


ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత కొన్నాళ్లు తగ్గేదేలే అన్న రీతిలో ఏపీ సిఎం జగన్‌పై విమర్శలు చేశారు నాని. అయితే టిడిపికి ఆయువుపట్టైన ఆర్థిక వనరులపై జగన్‌ దెబ్బేయడం మొదలెట్టారు. అందులో భాగంగా నాని ట్రావెల్స్‌పై కూడా ప్రభుత్వం కన్ను పడింది. దీంతో కేశినేని నాని ఢమాల్ అని పడిపోయారని బెజవాడ టాక్. అది ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ... అడ్డదారిలో నడుపుతున్న ట్రావెల్స్‌కి తాళం పడేలా చేసింది మాత్రం జగన్‌ సర్కార్‌ అని ప్రత్యర్థులు చెప్పుకుంటారు. 


ఇవన్నీ చాలవన్నట్టు మున్సిపల్ ఎన్నికల్లో కూతురినే మేయర్‌ అభ్యర్థిగా ప్రచారం చేసుకొని పార్టీని ఓటమి పాలు చేశారన్న అపప్రదను కూడా మూటకట్టుకున్నారాయన. పార్టీలో వేరే వారిని ఎదగనీయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని కూడా టీడీపీ వాళ్లు చెబుతున్న మాట. అందుకే అధినేత కూడా కేశినేని నాని తీరుపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. దీంతో నాని వర్గీయులంతా కేశినేని చిన్ని వైపు మొగ్గుతున్నారని సమాచారం. దీన్ని సహించలేకపోయిన నాని పార్టీని బజారున పెడుతున్నారని పార్టీ లీడర్లు చెబుతున్న మాట. ఇలా ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. 


ఈ ఆరోపణలు కొనసాగుతున్న టైంలో... కేశినేని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ హాట్‌గా మారాయి. ఏపీలో కమలం మింగేసే పార్టీ తెలుగుదేశమే అంటున్నారాయన. ఎన్టీఆర్‌ నుంచి పార్టీని చంద్రబాబు ఎలా సొంతం చేసుకున్నారో అలాగే చంద్రబాబు నుంచి పార్టీని సిఎం రమేష్‌ లాగేసుకుంటారని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఏక్‌ నాథ్‌ షిండేలా ఏపీలో సిఎం రమేష్‌ టీడీపీని కాషాయంలో కలిపేస్తారని ఆరోపించారు. 


నిన్నటి వరకు గుట్టు చప్పుడుగా ఉన్న కేశినేని బ్రదర్స్‌ పాలిట్రిక్స్‌ మాత్రమే కాదు పార్టీలోని కుమ్ములాటలు కూడా ఇప్పుడు రోడ్డు మీద పడటంతో చంద్రబాబు ఎలాంటినిర్ణయం తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న టిడిపి అధినేత ఆశయాలకు తమ్ముళ్లు ఇలా స్వలాభాలతో తూట్లు పొడవడం పార్టీని ఇరకాటంలో పడేసింది. 


ఇదిలా ఉంటే కమలంలో కలిసిపోయేది టిడిపి కాదని జనసేన అన్న వాదనలూ వచ్చాయి. అయితే ఈ వాదనలను ఇండైరక్ట్‌గా ఖండిస్తూ ఈ మధ్యన పవన్‌ కల్యాణ్‌ తాను బతికి ఉన్నంత వరకు పార్టీని విలీనం చేయబోనని ప్రకటించారు. కానీ రాజకీయనేతల మాటలను నమ్మేదెవరు ? అని అంటున్నారు. అందుకే ఇప్పుడు కేశినేని నాని రాజకీయాలకు దూరంగా ఉంటానన్న మాటలను కూడా విశ్వసించడం లేదని మరికొందరి వాదన. తాజాగా ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్ రేవంత్‌ రెడ్డిని కలవడంతో తెర వెనక ఏదో జరుగుతోందన్న టాక్‌ నడుస్తోంది.