పోల‌వ‌రంపై టీడీపీ నేత‌ల ప్ర‌చారాన్ని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. పోలవరం ఆలస్యానికి కారణం జగన్ ప్రభుత్వం అనే ముద్ర వేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కేవలం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని ఆరోపించారు.  కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్ల వరదల్లో కొట్టుకు పోయిందని తెలిపారు.


విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన అంబ‌టి వరద వచ్చిన 10 రోజులకు ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధితుల పరామర్శకు వెళ్లారని అన్నారు. భారీగా వరదలు వచ్చినా ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చూశామని వివరించారు. బాధిత కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున చెల్లించిన ప్రభుత్వం తమదని తెలిపారు. నాలుగు ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళా దుంపలు అని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీ అన్ని విషయాలు తెలుసుకోవాలని సూచించారు.


కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయని... ఎంత వరద వచ్చినా ప్రాజెక్టు దగ్గరే ఉండి కాపాడుకున్నామన్నారు అంబటి. పోలవరం ఎత్తుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు అంబటి రాంబాబు. ముంపు ప్రాంతాలను ఆర్డినెన్సు ద్వారా ఏపీలో కలిపారని... ఆ విషయాన్ని తెలగాణ నేతలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.


పోలవరం ప్రాజక్టు మొత్తం వాళ్ళే కట్టినట్టు టిడిపి మాట్లాడుతోందని అంబ‌టి ఎద్దేవా చేశారు. మంత్రిగా తనకు సాంకేతిక అంశాలు తెలియాల్సిన అవసరం లేదని తెలిపారు. కానీ కామన్సెన్సు ఉందన్నారు. దేశంలో ఆరోగ్య శాఖ ల మంత్రులు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా అని కామెంట్ చేశారు. టిడిపి నేతలు గేలి మాటలు మాట్లాడొద్దని హిత‌వు ప‌లికారు.


పోలవరం జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత దానిని తామే నిర్మిస్తున్నట్లు భ్రమింప చేస్తున్నారని టీడీపీ లీడర్లపై మండిపడ్డారు. జాప్యం జరగటానికి కారణంగా ఏపీ ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... ఇందులో టిడిపి 5 ఏళ్లు, వైసిపి మూడేళ్లు అధికారంలో ఉందని... ఇందులో ఎవరు ఎక్కువ సమయం అధికారంలో ఉన్నారో వాళ్లదే మిస్టేక్ అన్నారు. 20 వేల కోట్ల భూసేకరణ, పరిహారానికి వెచ్చిస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి అవ్వదన్నారు. కొత్త డీపీఆర్‌వో కేంద్ర ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. ఇంకా కేంద్రం నుంచి 2700 కోట్ల రూపాయలు ఏపీకి రావాల్సి ఉందని మంత్రి తెలిపారు.


త‌న‌కు బుద్ధి జ్ఞానం దానం చేస్తారా అని మాజీ మంత్రి దేవినేని ఉమను ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఏమయ్యా రాంబాబు అని దేవినేని ఉమ మ‌రోసారి అంటే ఊరుకునేది లేదన్నారు. తాను కూడ ఒరేయ్ అనాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు. ఏపీలో నిత్యం పని చేస్తున్న సీఎంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.