KA Paul Latest News: విజయవాడలో వరద బాధితులకు సాయం చేయడం చాలా సులభమైన పని అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గ్లోబల్ పీస్ మిషన్ ద్వారా తాము ఇలాంటి సహాయ కార్యక్రమాలను ఎన్నో చేశామని గుర్తు చేశారు. ముందు తక్షణ సాయంగా వేల మందికి ఆహారం, నీరు అందజేయాలని కోరారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తనతో కలిసి పని చేయాలని పిలుపు ఇచ్చారు. బుడమేరు కాలువకు వచ్చిన వరద కారణంగా ఎంతో మంది ఇళ్లు నాశనం అయ్యాయని, ఇళ్లు నాశనం అయిన వారికి ఇళ్లు కట్టించేలా తమతో కలిసి పని చేయాలని పిలుపు ఇచ్చారు. 


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. నగరంలో తీవ్రమైన వరద ప్రభావిత ప్రాంతం అయిన సింగ్ నగర్‌లో కేఏ పాల్ పడవపై ప్రయాణిస్తూ ఆహార పొట్లాలను వరద బాధితులకు పంచి పెట్టారు. ఏపీకి రూ.10 వేల కోట్లు, తెలంగాణకు మరో రూ.10 వేల కోట్లను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు రూ.కోటి, ఆస్పత్రుల్లో ఉన్న వారికి సాయం చేయాలని పిలుపు ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారి కోసం నగరంలోని మిగతా వారు కూడా పని చేసి మానవత్వం చాటుకోవాలని కేఏ పాల్ కోరారు. అక్రమ నిర్మాణాలను తొలగించేలా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేఏ పాల్ కోరారు.