Jaleel Khan: ఏపీ మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్‌ చేయడాన్ని నిరసనగా టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నాయి. చంద్రబాబును వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల చేయాలని డిమండ్ చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు. రోడ్లపైకి చేరుకుని ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు గత కొద్దిరోజులుగా నిరసనలను కొనసాగిస్తున్నారు. నిరవధిక నిరాహార దీక్షలు కూడా టీడీపీ చేపట్టింది. 


నిరసన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నల్ల బెలూన్లు ఎగుర వేశారు. ఈ సందర్బంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  కుట్రతోనే చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేసిందని విమర్శించారు.  చంద్రబాబును జైలులో పెట్టామని సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు తగిన మూల్యం చెల్లించుకుంటారని జలీల్ ఖాన్ హెచ్చరించారు. అభివృద్ధి, విజన్ ఉన్న నేతగా చంద్రబాబుకు మంచి పేరు ఉందన్నారు. 2004 ఎన్నికల నాటికి ఉన్న ఇంటిని జగన్ కుటుంబం బేరం పెట్టిందని, కానీ ఆ తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ కోట్లు దోచుకున్నారని జలీల్ ఖాన్ ఆరోపించారు.


ఐదేళ్లల్లో అన్ని రూ.కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పే దమ్ము జగన్‌కు ఉందా? అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. కోర్టులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందనే నమ్మకం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్‌ని పప్పు అన్నవాళ్లే ఇప్పుడు భయంతో వణుకుతున్నారని, అతని సవాళ్లను స్వీకరించలేక తోక ముడుస్తున్నారన్నారు. లోకేష్‌కు ప్రజల్లో వచ్చిన స్పందనతో వైసీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని, చాలామంది వైసీపీ నాయకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందనేది గుర్తు పెట్టుకోండి అని వైసీపీ నేతలకు జలీల్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు.


కృష్ణా జిల్లాలో నిరసన జ్వాలలు


చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ కృష్ణా జిల్లాలో టీడీపీ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం జిల్లాలోని పామర్రు మండలం జేమిగోల్వేపల్లిలో టీడీపీ మహిళా కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పామర్రు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వర్ల కుమార్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అండేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ చేపట్టారు. 'బాబు మీ వెంటే మేము ఉన్నాం' అంటూ నినాదాలు చేశారు. ఇక విజయవాడలోని ప్రసాదంపాడులో కూడా టీడీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో 200 మంది మహిళలు పాల్గొనగా.. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


తెలంగాణలో కూడా ఆందోళనలు


చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఖమ్మంలో చంద్రబాబు అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మయూరి సెంటర్ వరకు ర్యాలీ జరగ్గా.. ఇందులో పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. 'మేము సైతం బాబు కోసం' అనే ప్లకార్డులు ప్రదర్శించి బాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్‌లోని మధురానగర్‌లో జరిగిన నిరసనల్లో టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్‌పై విమర్శలు కురిపించారు. చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని, దారుణంగా అరెస్ట్ చేస్తారని ఆరోపించారు