UN SDG Summit: ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా న్యూయార్క్‌లో జ‌రుగుతున్న ఎస్డీజీ యాక్ష‌న్ వీకెండ్ స‌ద‌స్సులో.. ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. శనివారం రోజు జనరల్ అసెంబ్లీలో జరిగిన సదస్సులో ఏపీ విద్యార్థులు తమ గళం వినిపించారు. తొలిరోజు దడాల జ్యోత్స్న, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరి చంద్రలేఖ, షేక్ అమ్మాజాన్, వంజివాకు యోగేశ్వర్ మాట్లాడారు. 2030 నాటికి భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు సుస్థిరాభివృద్ధిలో యువత ప్రాధాన్యం చాలా అవసరం అని అన్నారు. అభివృద్ధికి యువత టార్చ్ బేరర్ గా బాధ్యత తీసుకోవడం ఎంతో అవసరం అని పేర్కొన్నారు.


అయితే యూఎన్ఓ స‌ద‌స్సులో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు పాల్గొన‌డం దేశ చ‌రిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులను లీడర్లను చేసేలా విద్యా వ్యవస్థలో సీఎం జగన్ అనేక సంస్కరణలు చేపట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన తీసుకొస్తున్న అద్భుతమైన పథకాల వల్లే సర్కారు బడిలో చదివే పిల్లలకు యూఎన్ఓ సదస్సులో స్థానం దక్కిందని అంటున్నారు. 






మరోవైపు మంత్రి బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..  ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి ప్రపంచ వేదికలపై మన విద్యార్థులు ప్రకాశిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దార్శనికతతో ఏపీ విద్యా వ్యవస్థలో సాధించిన అద్వితీయ విజయాలను ప్రపంచానికి వివరించబోతోందని అన్నారు. యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మాట్లాడేందుకు అమెరికా వెళుతున్న 10 మంది విద్యార్థులతో మాట్లాడటం ఆనందంగా ఉందని చెప్పారు. శనివారం రోజు విద్యార్థులను కలిసిన మంత్రి బొత్స విద్యార్థుల కుటుంబ నేపథ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో ప్రతిభావంతులైన ఈ విద్యార్థులు అసాధారణ కుటుంబాలకు చెందినవారు కావడం స్ఫూర్తిదాయకం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు.






జులైలో జరిగిన ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్‌లో రోజువారీ కార్యక్రమానికి సంబంధించిన స్టాల్స్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాలల పునరుద్ధరణ, విద్యా ఆశీర్వాదాలు, వసతి దీవెనలు, విద్యా బహుమతులు, డిజిటలైజేషన్ వంటి ఇతర విద్యా పథకాల వివరాలను యూఎన్ఓ ప్రతినిధులు కోరగా.. ఏపీలో "సమాన విద్య - అందరికీ విద్య అందుబాటులో"కి ఆకర్షితులయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏపీలో అమలవుతున్న సంస్కరణలను అందరికీ తెలిపేందుకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఆహ్వానించారని వెల్లడించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నాలుగేళ్లలో అనేక విద్యా సంస్కరణలు, పథకాలకు శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు.


రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయిని పరిగణలోకి తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి దృఢమైన నాయకత్వం, ప్రభుత్వ స్వచ్ఛమైన మనస్సు అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాయని వివరించారు. ఏపీ విద్యా వ్యవస్థ పటిష్టంగా రూపుదిద్దుకుంటోందని.. నేడు పేద ప్రజల జీవితాల్లో విద్య వెలుగులు పంచుతోందన్నారు. విద్యలో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు ఏపీ విద్యా పథకాలు, కార్యక్రమాలు పరిష్కారం కాబోతున్నాయని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.