మైలవరం వైసీపీ పంచాయితీ జగన్ వద్దకు చేరింది. ఇవాళ దీనిపై సీఎం ఆ నియోజకవర్గ లీడర్లతో సమావేశం కానున్నారు. ఇక్కడ మంత్రి జోగి రమేష్, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. దీనిపై ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి.
ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీ నేతలను ఆ దిశగా సన్నద్ధం చేస్తూనే విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే పలు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు మైలవరం వంతు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈ నియోజకవర్గం తరచూ వార్తల్లో ఉండటంతో దానిపై ఫోకస్ పెట్టారు జగన్.
ఎవరికి ఎలా...ఉంటుంది...
మైలవరం ఎవరికి వరంగా మారబోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్ళీ సిటు దక్కుతుందా... ఎమ్మెల్యే వసంత కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా... తనయుడి కోసం మంత్రి జోగి రమేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా.... మైలవరం పంచాయతీ పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమి తేల్చబోతున్నారు అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.
మైలవరం నియోజకవర్గంపై మంత్రి జోగి రమేష్ కన్నేశారు. స్థానిక అంశాలపై జోక్యం చేసుకుంటున్నారు. దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతం అసహనం వ్యక్తం చేశారు. ఇదే కొన్ని రోజుల నుంచి వైసీపీలో తలనొప్పిగా మారింది.
ఇప్పటికే పార్టీ పెద్దల పంచాయితీ...
మైలవరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో సీఎం సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపి గెలిపించే బాధ్యత కార్యకర్తల భుజాన పెడుతున్నారు సీఎం. నియోజకవర్గ అభ్యర్థులను అదే సమావేశంలో ఖరారు చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో నియోజకవర్గ సమావేశంపై ఆసక్తి ఏర్పడింది.
స్థానిక ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో పట్టు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ వివాదం కాస్త ముదరడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ పార్టీ పెద్దలను కలిసి మంత్రి జోగి రమేష్‌పై ఫిర్యాదు చేశారు. మంత్రి జోగి రమేష్ కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జలతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితులు, వసంత ఫిర్యాదులపై వివరణ ఇచ్చారు.
ఇద్దరు కలిసి పని చేయాలని పార్టీ ముఖ్య నేతలు చెప్పినట్టికీ ఇంకా నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ మంత్రిగా ఉన్న జోగి మైలవరం నియోజకవర్గంలో ఉన్న తన వర్గాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరాలు నడిపిస్తున్నారని వసంత వర్గం చాలా సీరియస్ గా ఉంది.
జగన్‌తో సమావేశం తరువాత అయినా కొలిక్కి వస్తుందా?
నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్యనేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో సీఎం జగన్ మైలవరం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నారు. మంత్రి జోగి రమేష్ ఆయనకు లేదంటే ఆయన తనయుడికి మైలవరం టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ మళ్ళీ మైలవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సమావేశంలో సీఎం జగన్, వసంత అభ్యర్థిత్వంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. గతంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ అభ్యర్థులను జగన్ ప్రకటించారు. ఇప్పుడు వసంత విషయంలోను అదే వైఖరితో ఉన్నారా అనేది ఆసక్తిగా మారింది. ఒక వేళ అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయన్నది అధికార పార్టీలో ఆసక్తిగా మారింది.