జై దుర్గా..జై జై దుర్గా నామస్మరణలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు ప్రతిధ్వనించాయి. భవానీ దీక్షా విరమణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ఠాపన చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దీక్షల విరమణకు అధికారులు శ్రీకారం చుట్టారు.


భవానీ దీక్షా విరమణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబరు 4న భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు 41 రోజులు దీక్షలు పూర్తి చేసి విరమణ చేసేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అనంతరం 6.30 గంటలకు మహా మండపం సమీపంలో ఏర్పాటు చేసిన హోమగుండాల్లో ఆలయ స్థానాచార్య విష్ణుభొట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, ఈవో డి.భ్రమరాంబ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగ్ని ప్రతిష్టాపన చేసి హోమగుండాలను ప్రారంభించారు. 


ఈవో డి.భ్రమరాంబ మీడియాతో మాట్లాడుతూ భవానీ దీక్షల విరమణకు ఈ ఏడాది సుమారు ఏడు లక్షల మంది భవానీలు తరలివచ్చే అవకాశం ఉందని అందుకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మూడు హోమ గుండాలను ఏర్పాటు చేయడంతోపాటు భవానీ బంధాలు స్వీకరించేందుకు 50 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పది ప్రసాదాల కౌంటర్లతోపాటు బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో కూడా రెండు ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 


భవానీలకు కూర్చుని తినే విధంగానే అన్నదానం నిర్వహిస్తున్నామని ఈవో స్పష్టం చేశారు. తొలిరోజే వేలాది మంది విరమణకు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు కిక్కిరిసాయి. దీక్షాపరుల గిరి ప్రదక్షిణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ తీసుకున్న ప్రత్యేక చర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం 200 మందిని మాత్రమే క్షురకులను నియమించడంతో కేశ ఖండన శాలల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది.


నేటి నుంచి ట్రాఫిక్ మళ్ళింపు...


భవాని దీక్షా విరమణలు సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. 14-12-2022 రాత్రి నుంచి 20-12-2022 రాత్రి వరకు ట్రాఫిక్ డైవర్షన్‌ అమలులో ఉంటుంది. విజయవాడ నుంచి  హైదరాబాద్, జగ్గయ్యపేట, తిరువూరు వెళ్లే ఆర్.టి.సి బస్సుల రాకపోకలను నియంత్రించారు.