NTR Death Anniversary: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి (AP Ex CM), దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు(Nandamuri Taraka Rama Rao) వ‌ర్థంతి ఈ రోజు. 1996, జ‌న‌వ‌రి 18న ఆయ‌న హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో మృతి చెందారు. రాష్ట్రంలో ఏర్ప‌డిన తొలి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దేశం పార్టీ(Telugu Desam Party) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడుగా.. ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. సినీ రంగం నుంచి తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన ఎన్టీఆర్‌.. 1983లో టీడీపీని స్థాపించారు. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లి.. కేవ‌లం ఆరు మాసాల్లోనే అధికారం ద‌క్కించుకున్నారు. 


ఈ ఏడాది స్పెష‌ల్ ఏంటంటే..


దివంగ‌త ఎన్టీఆర్‌ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు(TDP leaders),  ఆ పార్టీ శ్రేణులు ఘ‌న నివాళ‌లర్పిస్తున్నాయి. ప్ర‌తిసంవ‌త్స‌రం మాదిరిగానే ఈ ఏడాది వ‌ర్ధంతి(Death Anniversary) కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నా.. ఈసారి ఎన్నికల ఏడాది కావండంతో మ‌రింత ప్రాధాన్యం ఏర్ప‌డింది. మ‌రో రెండు మాసాల్లో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు(Elections) ఉండ‌డ‌మే. దీంతో ఎన్టీఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున కార్య‌క్ర‌మాల‌కు ప్లాన్ చేసింది. ఇదిలావుంటే.. ఎన్టీఆర్ సొంత ఊరైన‌.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని నిమ్మ‌కూరులో టీడీపీ సంబ‌రాలు అంబ‌రాన్నంటుతు న్నాయి. 


రా.. క‌ద‌లిరా స‌భ 


మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్(NTR) గ‌తంలో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఈద‌ఫా టీడీపీ ఎన్టీఆర్ వ‌ర్ధంతి సందర్బంగా `రా.. క‌ద‌లిరా!`(Raa Kadali Raa) బ‌హిరంగ స‌భ‌ ఏర్పాటు చేసింది. ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు(Nara ChandraBabu Naidu) ఈ నెల‌లో రా.. క‌ద‌లిరా! స‌భ‌ల‌కు శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఇది దివంగ‌త ఎన్టీఆర్ నినాదం. 1983లో టీడీపీని ప్రారంభించిన స‌మ‌యంలో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతోపాటు.. `తెలుగు దేశం పిలుస్తోంది రా.. క‌ద‌లిరా!` అంటూ ఆయ‌న ఊరూ వాడా నిన‌దించారు. 


టీడీపీ-జ‌న‌సేన‌ల నుంచి నాయ‌కులు


త‌ద్వారా.. తెలుగు జాతిని టీడీపీవైపు మ‌ళ్లించ‌డంలో ఎన్టీఆర్(NTR) స‌ఫ‌లీకృతుల‌య్యారు. పార్టీ అత్యంత వేగంగా గ్రామ స్థాయికి సైతం చొచ్చుకుపోయింది. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం త‌పిస్తున్న టీడీపీ.. రా.. క‌ద‌లిరా! నినాదాన్నే పేరుగా మార్చుకుని బ‌హిరంగ స‌భ‌ల‌కు శ్రీకారం చుట్టింది. తాజాగా ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని టీడీపీ గుడివాడ‌లో గురువారం సాయంత్రం.. రా.. క‌ద‌లిరా స‌భ‌ను నిర్వ‌హించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ స‌భ‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబుతోపాటు.. మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) కూడా హాజ‌రు కానుండ‌డంతో ఈ స‌భ‌కు మ‌రింత ప్రాధాన్యం ఏర్ప‌డింది. 


కొడాలి వ‌ర్సెస్ టీడీపీ


గుడివాడ శాస‌న స‌భ్యుడు, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర‌రావు(Kodali Sri Venkateswararao) ఉర‌ఫ్ నాని.. కూడా ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని నివాళుల‌ర్పించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌(NTR)ను ఓన్ చేసుకున్న కొడాలి.. ఏటా ఆయ‌న వ‌ర్ధంతి, జ‌యంతుల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో గురువారం కూడా ఆయ‌న వ‌ర్ధంతి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ వైసీపీకి ప్ర‌త్య‌ర్థి ప‌క్షంగా ఉన్న‌ టీడీపీ గుడివాడ‌లో `రా.. క‌ద‌లిరా!` స‌భ ఏర్పాటు చేస్తున్న వేళ దీనికిపోటీగా కొడాలి నాని కూడా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్ధం అయ్యారు. భారీ ర్యాలీని నిర్వ‌హించాల‌ని ఆయ‌న ప్లాన్ చేశారు. 


క్ష‌ణ క్ష‌ణం.. ఏం జ‌రుగుతుందో!


గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం.. ఇటు అధికార పార్టీ నాయ‌కుడు, ఎమ్మెల్యే కొడాలి నాని కార్య‌క్రమాలతోను, అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నిర్వ‌హిస్తున్న స‌భ‌లతోనూ వేడెక్కింది. ముఖ్యంగా ఇరు ప‌క్షాలు కూడా ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం.. కీల‌క‌మైన ఎన్టీఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని పోటాపోటీగా నిర్వ‌హిస్తుండడంతో రాజ‌కీయంగా ఈ ప్రాంతం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గుడివాడ పట్టణంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా నిర్వ‌హిస్తున్న ఈ కార్యక్రమాలు ఒక‌ర‌కంగా ఉత్కంఠ‌గా మారాయ‌నే చెప్పాలి. ఎన్టీఆర్ వర్ధంతిలో భాగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్(NTR Fans) పేరుతో కొడాలి నాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్ట‌గా.. టీడీపీ నియోజ‌క‌వ‌ర్గంఇంచార్జ్‌గా ఉన్న వెనిగండ్ల రామ్మోహ‌న్(Venigandla Rammohan) అంతేస్థాయిలో ఫ్లెక్సీలు క‌ట్టి మ‌రీ.. కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. దీంతో ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. మ‌రోవైపు.. పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.