Jr NTR Flexi Dispute: నందమూరి బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్. ఇన్నాళ్లూ లోలోప జరుగుతున్న ఫైట్ ఇప్పుడు బహిర్గతమైపోయింది. ఎన్టీఆర్ వర్ధంతి(NTR Death Anniversary ) సాక్షిగా జరిగిన ఫ్లెక్సీల రగడ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఫ్లెక్సీలు తొలగించాలని ఆయన బాబాయ్, హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ(Balakrishna) ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
పీక్స్‌కు చేరిన వార్
బాలకృష్ణ వర్గం, జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. వీళ్ల మధ్య అనడం కంటే టీడీపీతో అంటే బెటర్. అయితే ఇప్పటి వరకు ఎక్కడా అది బయటపడింది లేదు. ఒకరి గురించి ఒకరు ప్రస్తావించకుండానే ప్రసంగాలు కార్యక్రమాలు సాగుతూ వచ్చాయి. అయితే ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా కనిపించిన సీన్ వారి మధ్య ఏ స్థాయిలో విబేధాలు ఉన్నాయో చెబుతున్నాయి.
ఫ్లెక్సీలు తీసేయ్
పెద్దాయన ఎన్టీఆర్ వర్ధంతి కోసం ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి నందమూరి తారకరామారావు సమాధి వద్ద నివాళి అర్పిస్తున్నారు. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వచ్చి నివాళి అర్పించారు.
జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నందున ఆయన ఫ్యాన్ ఘాట్ వద్ద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. అందులో ఎన్టీఆర్, ఇతర నందమూరి ఫ్యామిలీ ఫొటోలు ఉన్నాయి. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వెళ్లిపోయిన తర్వాత వచ్చిన బాలకృష్ణకు ఫ్లెక్సీలు కనిపించాయి. కారు నుంచి దిగుతూ దిగుతూనే ఫ్లెక్సీలు తీసేయాని అక్కడే ఉన్న నిర్వాహకుడి చెవిలో చెప్పారు. దానికి ఆయనేదో వివరణ ఇచ్చారు.
వైరల్‌గా మారిన బాలయ్య ఆదేశాలు
కారు దిగిన వెంటనే తిసేయ్ అంటూ ఆదేశించారు. మళ్లీ ఆయన ఇంకా ఏదో చెప్పబోతుంటే... వెంటనే తీసేయ్ అంటూ మూడోసారి హెచ్చరించారు. ఇలా ఆయన చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలకృష్ణ నివాళి అర్పించి వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న ఫ్లెక్సీలను అనుచరులు తీసేశారు.
అరెస్టు తర్వాత మరింత గ్యాప్
చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి టీడీపీ శ్రేణులకు అసలు పడటం లేదు. పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినా టీడీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన ఉండేది కాదు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగింది. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ కానీ, కల్యాణ్ రామ్ కానీ స్పందించలేదు. ఇది టీడీపీ వర్గీయులను మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే చాలా విషయాలపై స్పందించే జూనియర్ మామయ్య అరెస్టుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తుంటారు.
జూనియర్ వర్గం నుంచి కౌంటర్
2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున కాలికి చక్రాలు కట్టుకొని ఎన్టీఆర్ ప్రచారం చేశారని... ప్రమాదానికి కూడా గురయ్యాయని ఆయన వర్గీయులు కౌంటర్ ఇస్తుంటారు. అలాంటి వ్యక్తిని తొక్కేసేందుకు టీడీపీ నుంచి చాలా ప్రయత్నాలు జరిగాయన్నది కౌంటర్‌గా వస్తున్న వాదన. ఆయనతోపాటు తండ్రి హరికృష్ణను కూడా పట్టించుకోలేదని అంటారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒక వర్గంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు.
జూనియర్, కల్యాణ్ రామ్ ఒక వర్గం
జూనియర్, కల్యాణ్ రామ్ ఇద్దరు ఒకవైపు ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా మరోవైపు ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో డెవిల్ విడుదల సందర్భంగా రాజకీయాలపై కల్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తాను జూనియర్ కలిసి చర్చించి రాజకీయాలపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియాలో రచ్చ షురూ
దీనిపై డిస్కషన్ జరుగుతుండగానే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించడం వివాదం పీక్స్‌కు చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన మీడియాలో కంటే సోషల్ మీడియాలా ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. టీడీపీ వర్గీయులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పెద్ద వారే జరుగుతోంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పాత విషయాలపై రచ్చ రచ్చ చేస్తున్నారు.