ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బయటపడిన నకిలీ సంతానోత్పత్తి కేంద్రం స్కామ్ తీవ్ర సంచలనంగా మారింది. దానితో రాష్ట్రంలో సంతానోత్పత్తి సేవలందిస్తున్న పలు కేంద్రాల(ఫెర్టిలిటీ సెంటర్స్ ) పని తీరును క్షుణ్ణంగా పరిశీలించి వివిధ అంశాలకు సంబంధించి ఒక సమగ్ర నివేదికను అందించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ కేంద్రంగా సంతానోత్పత్తి సేవలందిస్తున్న ఒక ఫెర్టీలిటీ సెంటర్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తనిఖీలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. జిల్లా స్థాయిలో ఆసుపత్రుల స్థాపనకు డిఎమ్ హెచ్ఓ లు ( డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ అనుమతులు మంజూరు చేస్తారు )తదనంతరం నిర్వహణ నియమాల మేరకు పని చేసే విషయాన్ని కూడా డిఎమ్‌హెచ్‌ఓలు పర్యవేక్షించి, నియమాలను ఉల్లంఘించే ఆసుపత్రులపై తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అధికారిక సమాచారం మేరకు రాష్ట్రంలో పని చేస్తున్న సంతానోత్పత్తి కేంద్రాల సంఖ్య , గూగుల్ ద్వారా వెతికినపుడు వచ్చిన ఫిర్టిలిటీ సెంటర్ల సంఖ్యలో వ్యత్యాసమున్నట్లు ప్రభుత్వానికి తెలిసింది. రాష్ట్రంలో డిఎమ్‌హెచ్‌ఓ లు మొత్తం ఎన్ని కేంద్రాలకు అనుమతులిచ్చారు, అనుమతులు లేకుండా ఎన్ని పనిచేస్తున్నాయి, 2024-25 లో ఆయా జిల్లాల్లో ఎన్ని కేంద్రాలను పరిశీలించారు, లైసెన్స్ లేకుండా పనిచేస్తున్న కేంద్రాలు ఎన్ని తేలాయి, ఆయా ఫిర్టిలిటీ సెంటర్ల పనితీరుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిపై ఏమి చర్యలు తీసుకున్నారు , ఎన్ని కేంద్రాలకు అనుమతులు నిరాకరించారు, నియమాలమేరకు ఈ ఫెర్టిలిటీ సెంటర్లు పనిచేసేలా చూడటానికి ఏమి చేపట్టారు అనే అంశంపై సమగ్ర నివేదికను అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు
ఎన్ టీ అర్ జిల్లా డి ఎమ్ హెచ్ ఓ విజయవాడలో పనిచేస్తున్న యూనివర్సల్ హెల్త్ కేర్ సెంటర్ పై తమ బృందంతో కలసి తనిఖీకి వెళ్లగా ఆ కేంద్రం మూసి ఉన్నట్లు డి ఎమ్ హెచ్ ఓ డా. సుహాసిని మంత్రి కార్యాలయానికి తెలిపారు. అక్రమాల ఆరోపణలతో అరెస్ట్ అయిన డా. నమ్రత పేరిటనే యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ మంజూరు అయిందని, తనిఖీ సమయానికి ఈ సెంటర్ సిబ్బంది ఎవరు లేకుండా మూసి ఉండటం అనుమానాలకు దారి తీస్తోందని, ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తగు చర్యలు చేపడతారని డిఎమ్ హెచ్ ఓ తెలిపారు.
జరుగుతున్న పరిణామాలతో రాష్ట్రంలో ఎన్ని నకిలీ సంతానోత్పత్తి కేంద్రాలు ఉన్నాయో అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది. అయితే పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి నకిలీ ఫెర్టిలిటీ సెంటర్లపై రైలు తీసుకుంటామని వైద్యశాఖ హామీ ఇస్తోంది.