Turakapalem: గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలని ఉన్నతాధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. తురకపాలెంలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాలని సూచించారు. తురకపాలెంలో నమోదైన వరుస మరణాల గురించి జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో విఫలం చెందారన్నారు. ఎ.ఎన్.ఎం.లు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లే సమయంలో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటే ఆ సమాచారం జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర అధికారులకు వెంటనే అందే వ్యవస్థను శాఖాపరంగా పటిష్టం చేయాలన్నారు.
రాష్ట్ర సచివాలయంలో గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలు, స్థానికుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, వాటి ఫలితాల గురించి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్, ఇతర అధికారులు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వివరించారు.
1501 మందికి 42 రకాల పరీక్షలు'తురకపాలెంలో 2018 మంది 18 ఏళ్లుపైబడిన వారున్నారు. వీరిలో 1,501 మంది స్థానికంగా ఉన్నారు. మిగిలినవారు లేరు. ఉన్న 1501 మందికి 42 రకాల పరీక్షలు చేశారు. 1,501లో 109 మంది జ్వర పీడితుల నుంచి వైద్య శిబిరాల ద్వారా రక్త నమూనాలు సేకరించారు. బ్లడ్ కల్చర్ పరీక్ష ద్వారా కేవలం 4% మందిలో 'మెలియోడోసిస్'ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరు మరణించగా ముగ్గురు కోలుకున్నారు' అని మంత్రికి అధికారులు వివరించారు. మట్టి నమూనాల పరీక్షల ఫలితాలు ఇంకా అందాల్సి ఉందని వెల్లడించారు.
కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉంది!
'1,501 మందిలో 7% మందికి మధుమేహం ఉంది. కిడ్నీకి సంబంధించిన ఆర్ఎఫ్ టి చేయగా 6% మందిలో యూరియా, సీరమ్ క్రియాటినిన్, లివర్ ఫంక్షన్ టెస్టు చేయగా... 10% మందిలో సమస్య ఉన్నట్లు తేలింది. లిపిడ్ ప్రొఫైల్ టెస్టు (కొలెస్ట్రాల్) లో దాదాపు 59% మందిలో తెల్లరక్తకణాల పరీక్షలో 13% మోతాదుకు మించి సమస్య ఉంది. ఏదో ఒక ఇన్ఫెక్షన్ (లింఫోసైటిస్) 14% మందిలో ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ఎర్ర రక్తకణాల(ఆర్‌బిసి) సమస్య 22% మందిలో ఉంది. రక్తహీనత(ఎనీమియా) సమస్య దాదాపు 48% మందిలో ఉంది. వీరిలో 66% మంది మహిళలు ఉన్నారు' అని మంత్రికి అధికారులు వివరించారు.
మరణాల నమోదు కోసం యాప్‌లో ప్రత్యేక ఆప్షన్
'తురకపాలెం ఘటన అనుభవంతో క్షేత్రస్థాయిలో ఉండే ఎ.ఎన్.ఎం.లు, ఆశాలు యాప్ లో ఏరోజుకారోజు సదరు గ్రామాల్లో సంభవించిన మరణాల గురించి నమోదు చేస్తారు. నిర్దిష్ట సంఖ్య కంటే మరణాల నమోదు ఎక్కువగా జరిగితే వెంటనే అలెర్ట్ మెసేజ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అలాగే రాష్ట్ర అధికారులకు ఏకకాలంలో వచ్చేలా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. దీనివల్ల సకాలంలో సంబంధిత ప్రాంతాల్లోని పరిస్థితులపై అప్రమత్తమై వెంటనే సత్వర చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది'అని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై సిఫార్సులతో ఇచ్చే నివేదికలో అక్కడ పర్యటించిన వైద్య బృందాల అభిప్రాయాలు, చేసిన సిఫార్సులు ఉండాలన్నారు. అలాగే మరణాలకు సంబంధించిన కేస్ షీట్ల నిశిత పరిశీలనలో గమనించిన పూర్తి వివరాల్ని నివేదికలో పొందుపర్చాలన్నారు.
కొత్తరెడ్డిపాలెంలోని పరిస్థితులపైనా అధ్యయనం చేయాలి?తురకపాలెం మాదిరిగానే సమీపంలో ఉన్న కొత్తరెడ్డిపాలెం గ్రామస్తులకు కూడా పరీక్షలు చేయాలన్నారు. ఇక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఇంచుమించు తురకపాలెం మాదిరిగానే ఉన్నాయని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంటు డాక్టర్ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.