సోషల్ మీడియాలో తనపై టీడీపీ నేతలు అసత్య ప్రచరాలు చేస్తున్నారని టీడీపీ రెబల్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆరోపించారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


కోర్టులో పిటిషన్ వేసిన వల్లభనేని... 
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనతో పాటుగా మాజీ మంత్రి కొడాలి నాని పై టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేయటం దారుణమని ఆయన అభ్యంతర తెలిపారు. సంకల్ప సిద్ధికేసులో మాజీ మంత్రి కొడాలి నానికి, తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికి, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటం, ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు గానీ, కొడాలి నానికి కానీ ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే. సంకల్ప సిద్ధి  ద్వారా ప్రజల సొమ్ము కొల్లగొట్టామని టిడిపి నేతలు తమపై పలు ఆరోపణలు చేశారని వంశీ అన్నారు. ఈ వ్యవహరంలో  పరువు నష్టం కింద కోర్టులో దావా వేసినట్లు ఎమ్మెల్యే వంశీ తెలిపారు.


సంకల్ప సిద్ధి మార్ట్ పై టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన టీడీపీ నేత పట్టాభి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని వంశీ ఫైర్ అయ్యారు. సంకల్ప సిద్ది వ్యవహరంలో డబ్బులు పోగేసుకొని, మాజీ మంత్రి కొడాలి నానితో కలసి తాను బెంగళూరులో ఆస్తులు కొన్నానని అసత్య ఆరోపణలు చేశారని, వీటికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రాజకీయం కోసమే నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ నాయకులపై న్యాయం కోసం కోర్టు తలుపులు తట్టామని, న్యాయస్థానంలో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని వంశీ అన్నారు. ఈ కేసులో టీడీపీ నేతలకు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుందని వంశీ వ్యాఖ్యానించారు.


సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు... 
ఎమ్మెల్యే వంశీ 2019లో గన్నవరం నుంచి శాసనసభ స్దానానికి పోటీ చేశారు. టీడీపీ టిక్కెట్ పై గెలిచిన వల్లభనేని వంశీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, టీడీపీకి దూరం అయ్యారు. వైఎస్ఆర్ సీపీ నుంచి గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో ఉన్న ఫ్రెండ్ షిప్, సీఎం జగన్ నాయకత్వంపై ఆసక్తితో అధికార పార్టీకి దగ్గరయ్యారు. అయితే అధికారికంగా వంశీ వైసీపీ కండువా కప్పుకోలేదు. ఈ వ్యవహరం టీడీపీ నేతలకు ఇరకాటంగా మారింది. దీంతో వంశీని టార్గెట్ చేసిన టీడీపీ నేతలు ఆయన్ను రాజకీయంగా విమర్శించేందుకు అన్ని మార్గాలలో ప్రయత్నిస్తున్నారు.


అసెంబ్లీ ఘటన తరువాత దూకుడు పెంచిన టీడీపీ... 
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుతో పాటుగా, ఆయన భార్య భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ఆవేదన చెందిన చంద్రబాబు పార్టి కార్యాలయం వేదికగా కన్నీటి పర్యంతం కావడం తెలిసిందే. ఈ వ్యవహరంలో అప్పటి మంత్రి కొడాలి నానితో పాటుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా ఉన్నారని టీడీపీ ఆరోపించింది. అప్పటి నుంచి టీడీపీ నేతలు వంశీ, కొడాలి నానిని రాజకీయంగా అన్ని వైపుల నుండి టార్గెట్ చేసేందుకు సమాయత్తం అయ్యారు. అదే సందర్బంలో విజయవాడ కేంద్రంగా సంకల్ప సిద్ది కేసు వెలుగులోకి రావటం, అందులో అదికార పార్టీకి చెందిన నాయకుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో టీడీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లను తెరమీదకు తీసుకువచ్చారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగటంతో తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని టీడీపీ నేతలకు వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. అయినా వారు స్పందించలేదని, దీంతో తన పరువుకు భంగం కలిగించినందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించానని వంశీ అన్నారు.