టీడీపీ నేత చింతకాలయ విజయ్ నేడు సీఐడీ అధికారుల ముందు హజరయ్యారు. న్యాయవాది సహయంతో ఆయన సీఐడీ అధికారుల విచారణకు వెళ్లారు. తన అభిప్రాయాలు వివరించనున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే వేధింపులకు పాల్పడుతున్నారని ఈ సందర్బంగా టీడీపీ నేతలు మండిపడ్డారు.


సీఐడీ నోటీసులకు సమాధానంగా...


వారం రోజుల క్రితం సీఐడీ అధికారులు చింతకాలయ విజయ్‌కు నోటీసులు అందించారు. ఆయన సొంత ఊరికి వెళ్లి మరీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, విజయ్ అందుబాటులో లేరు. దీంతో ఆయన తల్లికి నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు విచారణకు రావాలని సూచించారు. ఆ నోటీసులు ప్రకారం చింతకాయ విజయ్ నేడు సీఐడీ అధికారుల ముందు విచారణకు హజరయ్యారు. 


సీఐడీ విచారణ కోసం విజయవాడ వచ్చిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్‌ను టీడీపీ నేత బుద్దా వెంకన్న కలసిశారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. అనంతరం  విజయవాడ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి బయలుదేరి వెళ్ళారు.


ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం...


ఈ సందర్బంగా టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నమాట్లాడుతూ సోషల్‌మీడియాలో మిస్యూజ్ చేశారని చింతకాలయ విజయ్ పై కేసు పెట్టారని చెప్పారు. 41 a నోటీసు ఇవ్వకుండా  గతంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని, కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇవాళ విచారణకు న్యాయవాదితో కలసి  చింతకాయల విజయ్ హాజరయ్యారని తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని, దుర్మార్గపు రాజ్యంలో ఇబ్బందులు ఉంటాయని ప్రజాస్వామ్యంలో ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. విచారణ ముగిశాక అన్ని విషయాలు మాట్లాడతామన్నారు. ప్రభుత్వం వేధించటమే పనిగా పెట్టుకొని పని చేస్తుందని అన్నారు. జగన్ సర్కార్‌లో ప్రతిపక్షాలకు కనీసం రక్షణ లేకుండాపోయింది, ప్రజలకు కూడా వేధింపులు తప్పటం లేదని ఫైర్ అయ్యారు.


టైం వస్తుంది... బుద్ది చెబతాం: బుద్దా


అయ్యన్న పాత్రుడి కుటుంబాన్ని అణగదొక్కాలనే అనేక రకమైన కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక బిసిలను, బీసి నేతలను  అణగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిలంతా చంద్రబాబుకు అండగా ఉంటారని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. బిసిలంతా చంద్రబాబు నాయకత్వంలో పని చేసి జగన్‌ను పారద్రోలే దాకా విశ్రమించబోమన్నారు. సిఐడి కేసులకు భయపడేది లేదు.. దీటుగా ఎదుర్కొంటామని బదులిచ్చారు. కేసులు పెట్టి భయపెడతాం అనుకుంటే దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. మహిళలపై సోషల్‌ మీడియాలో చింతకాయల విజయ్‌ ఎటువంటి అసభ్యకరమైనవి పెట్టలేదని, అదంతా ఫేక్ అని బుద్దా అన్నారు. జగన్ విధానాలను ఎండగడతాం తప్ప మహిళల గురించి తప్పుగా మాట్లాడే విదానం తమది కాదని వెల్లడించారు. జగన్ ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తున్నందునే, తమ గొంతు నొక్కేందుకు పోలీసులు, సీఐడీని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పని చేస్తున్నారని ఆరోపించారు.


దేవినేని ఉమాను కలిసిన చింతకాయల విజయ్


చింతకాయల విజయ్ గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమాను కలిశారు. గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లే ముందు జిల్లా పార్టీ నాయకులతో చింతకాయల విజయ్ సమావేశం అయ్యారు. కేసుకు సంబంధించిన వివరాలను నాయకులతో చర్చించారు. తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకే విజయ్‍పై కేసు పెట్టారని ఈ సందర్బంగా దేవినేని ఉమా అన్నారు. అయ్యన్న కుటుంబం నీతినిజాయతీతో బతుకుతోందన్నారు. సెంటు భూమి కోసం ప్రభుత్వ అధికారులతో కేసు పెట్టించారని, తాడేపల్లి నుంచి సజ్జల చెప్పినట్లుగానే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. అవినీతి సొమ్ము కాపాడుకునేందుకే కొడాలి, పేర్ని నాని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కళ్లలో ఆనందం కోసం బూతులు తిడుతున్నారని ఫైర్ అయ్యారు.