Free Gas Cylinder Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలకమైన పథకాన్ని ప్రారంభించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఫ్రీ సిలిండర్ పథకానికి సంబంధించిన బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళి నుంచి ఉచిత సిలిండర్‌ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే డీఎస్సీ, పింఛన్ల పెంపు హామీలను నెరవేర్చింది. ఇప్పుడు ఫ్రీ సిలిండర్ హామీని నెరవేర్చే దిశగా అడుగు వేసింది. 


ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఫ్రీ సిలిండర్ హామీ కీలకమైంది. ఇప్పటి వరకు నిధులు సర్దుబాటు కాకపోవడంతో పథకం అమలును వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తోంది. దీపావళి కానుకగా అర్హులైన వారందరికీ ఉచితంగా సిలిండర్లు ఇవ్వబోతోంది. 


నాలుగు నెలలకో సిలిండర్


ఆధార్‌, వైట్‌ రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ గ్యాస్‌ వియోగదారు కూడా ఈ స్కీమ్‌లో అర్హులుగా చేసింది. ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ప్రభుత్వం... ముందు లబ్ధిదారుల నుంచి కంపెనీలు డబ్బులు తీసుకోనున్నాయి. అలా తీసుకున్న 851 రూపాయలను రెండు రోజుల్లో లబ్ధిదారుడి ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా ప్రతి నాలుగు నెలలకోసారి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. 


48 గంటల్లో వినియోగదారుడి ఖాతాల్లో డబ్బు


మొదటి బుకింగ్ ప్రక్రియ నవంబర్ నుంచి మార్చి వరకు చేసుకోవచ్చు. తర్వాత ఏప్రిల్ నుంచి రెండో ఉచిత సిలిండర్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన రాయితీ నిధులను సోమవారమే ప్రభుత్వం విడుదల చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌర సరఫరాలశాఖ కలిసి ఈ డబ్బులను ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. 


శ్రీకాకుళంలో పథకం ప్రారంభం!


ఈ పథకాన్ని అధికారికంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళంజిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రారంభించాలని అనుకున్నారు. అయితే అప్పుడు వాయుగుండం ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు వీలుపడలేదు. వాతావరణం సహకరించలేదు. ఆఖరి నిమిషంలో ప్రకాశం జిల్లా నాగులప్పలపాడులో పర్యటించారు. 


అందుకే ఈసారి ఫ్రీ సిలిండర్ పథకాన్ని ఇచ్చాపురంలో ప్రారంభించబోతున్నారని సమాచారం. ఇప్పటికే కంచిలీ, ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో బహిరంగ సభకు, ముఖ్యమంత్రి హెలికాప్టర్‌కు దిగేందుకు అధికారులు స్థలాలను పరిశీలించారు. ఈ టూర్ ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. 


ఈ కేవైసీ తప్పనిసరి


తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్రాతిపదికగా వంట గ్యాస్ సిలిండర్ రాయితీ ఇస్తున్నారు. ఆధార్, ఫోన్ నెంబర్ ఆధారంగా వంట గ్యాస్ ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నప్పటికీ రాయితీ పొందాలంటే మాత్రం రేషన్ కార్డు వివరాలు మీ మూడు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం కూడా ఇంత వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మూడింటిని ఎలా అనుసంధానం చేయాలనే విషయంపై స్పష్టత లేదు. 


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1.47 కోట్ల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 20 లక్షల మంది మాత్రమే ఈకైవైసీ చేసి ఉన్నారు. మిగతా వాళ్లు ఇంకా చేయాల్సి ఉంది. ఈకేవైసీ చేయనిదే పథకానికి అర్హత సాధించలేరని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలు కిక్కిరిసిపోతున్నాయి. 


Also Read: అభిమాన నేతకు పేద విద్యార్థిని తీపి జ్ఞాపిక - మురిసిపోయిన సీఎం చంద్రబాబు